Aug 06,2023 10:03

బిడ్డ ఏడుపు విన్న వెంటనే చెంతకు చేరుతుంది తల్లి. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. ఆ ఇద్దరి మధ్యా అనుబంధానికి సంకేతమది. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటుంది తల్లి. అయితే కొంతకాలంగా కొన్ని అపోహలు, భయాలకు గురైన తల్లులు కొందరు పాలివ్వడానికి సంకోచిస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కలిగించాలనేదే ఈ తల్లిపాల వారోత్సవాల ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ సమన్వయంతో 120 దేశాల్లో ఈ వారోత్సవాలు ప్రతియేటా జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం థీమ్‌ ఏమిటి..? ఎందుకు తల్లిపాలే బిడ్డకు అవసరం..? అవి లభ్యం కానప్పుడు ఏం చేయాలి.. వంటి సందేహాలపైనే ఈ కథనం.

022

మూడురోజుల వరకూ తల్లిపాలు పడవనేది సరికాదు. కాన్పు అయిన వెంటనే బిడ్డకు పాలివ్వాలి. ఈ ముర్రుపాలు పాపాయి ఆరోగ్యానికి రక్షణ. పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు అందరిలో సమానమే.
పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా ఉండి, ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
పాలిచ్చేటప్పుడు కొద్దిపాటి నొప్పి ఉంటే ఓర్చుకోవచ్చు. ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
బిడ్డ పుట్టిన తరువాత మొదట వచ్చే పాలు సరిపోతాయి. బిడ్డ సరిగా పాలు తీసుకోకపోవడం వల్ల ఆకలి వేయవచ్చు.
బిడ్డకు అవసరమైన నీళ్ళు తల్లిపాలలోనే సరిపోయేటంతగా ఉంటాయి.
బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ తల్లిపాలలోనే ఉంటాయి.
పాలిచ్చిన ప్రతిసారీ శుభ్రం చేసుకోవాలి.
తల్లిపాలల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడో, ప్రత్యేకమైన సమస్యతో మందులు వాడుతున్నప్పుడో వైద్యుల సలహా మేరకు పాలివ్వడం ఆపాలి. అంతేతప్ప, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి బిడ్డను కాపాడేది తల్లిపాలే.
సిజేరియన్‌ అయిన తక్షణం, ఇవ్వగలిగే స్థితిలో ఉంటే, డాక్టర్ల సూచన మేరకు తల్లి బిడ్డకి పాలివ్వొచ్చు.
వైద్యుల సలహాతోనే పాలిచ్చు తల్లులు పోషకాహారం తీసుకోవాలి.
పాలిచ్చు తల్లులు ద్రవపదార్థాలు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల పాలల్లో సాంద్రత స్థాయిల్లో సమతుల్యత వస్తుంది.
బిడ్డకు ఆరవ నెల వచ్చేంత వరకూ తల్లిపాలే ఆహారం. ఆ పాలలోనే బిడ్డ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ ఉంటాయి. కానీ బిడ్డకు పాలిచ్చే విషయంలో కానీ, బిడ్డ తల్లి తీసుకునే ఆహార విషయంలోగానీ కొన్ని అనుమానాలు.. కొన్ని అర్థం లేని నమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అనుమానాలు తీర్చి.. నమ్మకాలను నివృత్తి చేసి, తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు తెలియచెప్పడమే లక్ష్యంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. మొదట 1992లో వరల్డ్‌ ఎలయెన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ యాక్షన్‌ (డబ్ల్యుఏబీఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
 

                                                                               2023 థీమ్‌..

'బిడ్డకు తల్లి పాలివ్వడం తప్పనిసరి చేయాలి.. ఉద్యోగినులు, పనిచేసే తల్లిదండ్రులలో బిడ్డకు పాలిచ్చేలా సదుపాయం కల్పించాలి.' అనే థీమ్‌తో ఈ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ..
 

                                                                                  పోషకాలు..

  • తల్లిపాలలో ఉండే లాక్టోజ్‌.. క్యాల్షియం, ఇతర ఖనిజాలను గ్రహించి, నాడీవ్యవస్థ పనితీరు చురుకుగా ఉండేలా చేస్తుంది. 50 శాతం ఐరన్‌ ఉంటుంది.
  • కార్బోహైడ్రేట్లు 40 శాతం ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి.
  • తల్లి పాలలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్‌లో (వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలు) 90% ప్రోటీన్‌ ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తుంది.
  • పాలలో కేసిన్‌, క్యాల్షియం, ఫాస్ఫేట్‌, లైసోజైమ్‌ కూడా ఉంటాయి.
  • లాక్టోఫెర్రిన్‌లో 26% ప్రోటీన్‌ ఉంటుంది. దీనిలో ఉండే యాంటీమైక్రోబియల్‌ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.
  • తల్లి పాలలో ఉండే కొవ్వుల ద్వారానే 50 శాతం పోషకాలు అందుతాయి. శిశువు కేంద్ర నాడీవ్యవస్థ పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలో ఉండే ఐకోస పెంటెనోయిక్‌ యాసిడ్‌, డోకోస హెక్సేనోయిక్‌ యాసిడ్‌ శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.
  • తల్లి పాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, క్యాల్షియం, క్లోరిన్‌ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
  • తల్లిపాలలో ఉండే లినోయిన్‌ అనే ఆమ్లం శిశువు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. అందుకే తల్లిపాలు బిడ్డకు అమృతాహారం అంటారు.

                                                                                 ముర్రుపాలు..

బిడ్డ పుట్టిన తర్వాత నాలుగు రోజులపాటు వచ్చే తల్లిపాలను ముర్రుపాలు అంటారు. ఇవి బిడ్డకు మొదటి టీకాలాంటివి. వీటిలో జింక్‌, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహారాన్నిస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్‌ 'ఏ' ఉంటుంది. ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం సహకరిస్తాయి. శిశువు పేగులను శుభ్రం చేసి, మల విసర్జనకు తోడ్పడతాయి.
 

                                                                              ఎంత కాలం..?

శిశువు పుట్టిన మొదటి గంటలోపే తల్లిపాలివ్వాలి. మొదటి రెండు నెలల్లో బిడ్డకు ప్రతి రెండు గంటలకొకసారి పాలు పట్టాలి (రాత్రులైన సరే). తప్పనిసరిగా బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకూ తల్లిపాలే బిడ్డకు శ్రేష్ఠం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఆరు నెలల తర్వాత ఇంటిలో తయారుచేసిన ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి.
 

                                                                             తల్లి ఆహారం..

బాలింతల ఆహార విషయం ఇప్పటికీ చాలా నియమ నిబంధనలు పెడుతున్నారు. బలమైన ఆహారం తీసుకుంటే వంటికి నీరు పడుతుందని, పొట్ట వస్తుందని, బిడ్డకు జలుబు, వాతంలాంటివి చేస్తాయని రకరకాల అపోహలున్నాయి. దాంతో కొన్ని రోజులపాటు నల్లకారంతోనే వారికి అన్నం పెడతారు. ఆ తల్లి శరీరం మళ్ళీ పట్టిష్టమవ్వాలన్నా, బిడ్డకు తగినన్ని పాలు ఉండాలన్నా పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుంది. అందుకని ఆమె తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసం తదితర ప్రోటీన్‌ ఫుడ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అమ్మలూ.. తెలిసింది కదా తప్పకుండా మీ పిల్లలకు పాలిస్తారు కదా.. తెలియని వారికి మన వంతుగా తెలియచేసి, పిల్లలను ఆరోగ్యవంతులుగా పెంచుదాం. అందరం తల్లిపాల వారోత్సవాల్లో పాలుపంచుకుందాం. తల్లులకు అవగాహన పెంచుదాం.

55

                                                                         తల్లిపాల బ్యాంకులు..

కవలలు, అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టినపుడు తల్లిపాలు సరిపోవు. అలాగే శిశువు తల్లి మరణిస్తే ఆ బిడ్డకు తల్లిపాలు ఎలా? హెచ్‌ఐవి, బ్రెస్ట్‌ కాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురైన తల్లులు పాలివ్వకూడని పరిస్థితి. అంతేకాదు దత్తత చేసుకున్న పిల్లలకూ తల్లిపాలు కావలసిందే కదా.. ఇలాంటి పిల్లల కోసమే 'తల్లిపాల బ్యాంక్‌లు ఏర్పడ్డాయి. ఆసియాలో మొదటి తల్లిపాల బ్యాంకు (1989) ముంబైలోని సియాన్‌ హాస్పిటల్‌లో ఏర్పడింది. ఆరోగ్యమైన మహిళలు ప్రసవం తర్వాత వారి బిడ్డలకు ఇవ్వగా, మిగులు పాలను తల్లిపాల బ్యాంకులకు దానం చేస్తారు. కృత్రిమంగా ఇచ్చే పాల కంటే పాశ్చరైజ్డ్‌ డోనర్‌ పాలల్లో పోషకాలు ఎక్కువ.
            అయితే వీటిని సేకరించే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దాతలకు ముందుగా కౌన్సెలింగ్‌ ఇస్తారు. వారి ఇష్టప్రకారమే పాలు ఇస్తున్నట్లు వారి నుంచి రాతపూర్వకంగా హామీ పత్రం తీసుకుంటారు. దాత ఆరోగ్య వివరాలు సేకరించి, శారీరక పరీక్షలు జరుపుతారు. నమూనా తీసుకున్న తర్వాత ప్రయోగశాలకు పంపుతారు. ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిసిన తర్వాతనే దాతను తల్లిపాలను సేకరించే ప్రాంతానికి పంపుతారు. తీసుకోవలసిన జాగ్రత్తలతో శిక్షణ పొందిన సిబ్బంది సహాయంతోనే తల్లిపాలను సేకరిస్తారు. ఇంటి దగ్గర నుంచి సేకరించరు. సరిగ్గా లేబుల్‌ చేయబడిన స్టెరైల్‌ కంటైనర్‌లో పాలను సేకరించి, మైక్రోబయోలాజికల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేస్తారు. పాశ్చురైజ్‌ చేసి, కల్చర్‌ టెస్ట్‌లో బ్యాక్టీరియా టెస్ట్‌ నెగెటివ్‌ వచ్చాకనే నిల్వ చేస్తారు. ఆ తర్వాతే వాటిని అవసరమైన శిశువులకు పంపిణీ చేస్తారు.

టి.గీతిక
7095858888