Nov 07,2023 09:03
  • వర్షాభావంతో వాడుముఖం పట్టిన మిర్చి
  • రక్షించుకోవడానికి రైతుల పాట్లు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :  వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు జిల్లాలో మిర్చి రైతులకు కష్టాలే మిగిలాయి. ఎండుతున్న పంటను కాపాడేందుకు రైతులు ట్యాంకర్లతో తడులు అందిస్తున్నారు. నీటి కోసం రైతుల నుంచి ఆర్డర్లు వస్తుండడంతో ట్యాంకర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. జిల్లాలో మిర్చి 1,49,735 ఎకరాల్లో వేశారు. రైతులు ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో 401 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 140 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే, 261 మిల్లీమీటర్ల (65 శాతం) లోటు వర్షపాతం ఉంది. కళ్లముందే మొక్కలు ఎండిపోతుంటే చూస్తుండలేక తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావాలి. పంటను కాపాడుకోకపోతే ఒక్క క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదని, దీంతో, ట్యాంకర్లతో తడులు అందిస్తున్నామని రైతులు తెలిపారు. ట్యాంకర్‌ ఒక్కంటికీ సుమారు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఎకరా విస్తీర్ణంలో ఒక తడి కోసం ఐదు నుంచి ఆరు ట్యాంకర్ల నీరు అవసరం అవుతోంది. దీంతో, తడుల కోసం ఎకరాకు అదనంగా రూ.25 నుంచి 30 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇతర పంటలతో పోలిస్తే మిర్చి సాగుకు ఖర్చు అధికంగా అవుతోంది. మంచి ధర ఉందనే ఉద్దేశంతో రైతులు ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపారు. వర్షాభావం వారి ఆశపై నీళ్లు జల్లింది. మొక్కలు వాడిపోతున్నాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. తెగుళ్ల ఉధృతి వల్ల కూడా అదనంగా ఖర్చు అవుతోంది. దీంతో, ఖర్చు అమాంతం పెరిగిపోయింది. వర్షాభావం, తెగుళ్ల వల్ల ఇప్పటికే కొంత నష్టం జరిగినందున దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ప్రస్తుతం క్వింటాలు మిర్చి ధర రూ.35 వేలు ఉందని, పంట మిగతా 2లో చేతికి వచ్చే సమయానికి ఆ ధర ఉంటుందో, ఉండదోనని ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. బోర్ల కింద సాగు చేస్తున్న మిర్చి పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. వ్యవసాయానికి రోజుకు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలి. విద్యుత్‌ కోతలు ఎక్కువయ్యాయని, ఒక్కో రోజు గంట, రెండు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతోందని రైతులు తెలిపారు. మిర్చిలో బొబ్బర తెగులు, తామర పురుగు ఉధృతి అధికంగా ఉంది. బొబ్బర తెగులు సోకిన మొక్క ఎదుగుదల లోపించడంతోపాటు వేగంగా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తోంది. ఈ తెగులు సోకిన మొక్కలను గుర్తిస్తే వెంటనే పీకేసి తగులబెట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

                                                               తడుల కోసం రూ.30 వేలు ఖర్చు

ఎకరా విస్తీర్ణంలో మిరప సాగు చేస్తున్నాను. మామూలుగా రూ.70 వేల నుంచి రూ.90 వేలు ఖర్చు అయ్యేది. ఈ ఏడాది వర్షాభావం వల్ల ట్యాంకర్ల ద్వారా నీటి తడులు ఇవ్వాల్సి వస్తోంది. ఎకరాకు రూ.30 వేలు అదనంగా ఖర్చు. దీనివల్ల ఖర్చు పెరిగింది.
                                                                                                              - రవి కుమార్‌, సంతేకుడ్లూరు,
                                                                                                                       ఆదోని మండలం

123

                                                పురుగు మందుల పిచికారీకి ఎకరాకు రూ.50 వేలు ఖర్చు

ఆరు ఎకరాలలో మిరప సాగు చేస్తున్నాను. పైరుకు నల్లి, తెల్ల దోమ సోకి పంట దెబ్బతింది. పురుగు మందు ల పిచికారీకి ఎకరాని కి రూ.40 వేలు చొప్పున అదనపు ఖర్చయింది. వర్షాభావం వల్ల పైరు ఎదుగుదల ఆగిపోయింది. పంట చేతికి వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి ఉంది.
                                                                                                         - బార్కి రాజశేఖర్‌, పెద్ద హరివాణం,
                                                                                                                      ఆదోని మండలం