ఎత్తుకు తగిన బరువు ఉండడం, పీచు పదార్థాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం, ఊబకాయం లేకుండా చూసుకోవడం, ధూమపానం-మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, ప్రతిరోజు శరీరం అలసిపోయే విధంగా కనీసం ఒక్క గంట పాటు వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజుకు ఆరు గంటలు నిద్ర ఉండే విధంగా చూసుకోవడం లాంటి ఆరోగ్య నియమాలను పాటించగలిగితే వంశపారంపర్య చరిత్ర ఉన్నప్పటికీ షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంటే కొంతకాలం పాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాన్ని వెనక్కి నెట్టవచ్చు. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించగలిగితే షుగర్ వ్యాధి వచ్చినా కానీ ... షుగర్ వ్యాధి వల్ల వచ్చే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతున్న వ్యాధులలో ప్రధానమైనది మధుమేహం. ఈ వ్యాధికి సంబంధించిన వైద్యంలో ఇన్సులిన్ ఇంజక్షన్ చాలా ప్రధానమైనది. ఇన్సులిన్‌ను కనుగొనడం (1922) వైద్యశాస్త్రంలో చెప్పుకోదగ్గ గొప్ప విజయం. బెంటింగ్ అనే శాస్త్రవేత్త తన సహాయక శాస్త్రవేత్త చార్లెస్ బెస్ట్‌తో కలిసి 1922లో జంతువుల నుంచి ఇన్సులిన్‌ను ఎలా తీయాలి, తీసిన ఇన్సులిన్‌ను ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని సమాజానికి అందించారు. తీవ్రంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధి గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి బెంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం 1991 నుంచి కొనసాగుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు సెక్లకు ఒకరు షుగర్ కారణంగా చనిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉందని నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకటించింది. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి ఉందని అర్థం చేసుకోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య 2030 నాటికి 64 కోట్ల మందికి, 2045 నాటికి 78 కోట్లకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో కూడా మధుమేహుల సంఖ్య అదే విధంగా పెరుగుతూ వున్నది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల 2023 జూన్ నెలలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో మధుమేహుల సంఖ్య 10.1 కోట్లు. అంతేకాకుండా మరో 13.6 కోట్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిస్ దశల్లో ఉన్నారు. త్వరలో వీరు డయాబెటిస్ రోగులుగా మారిపోతారు. భారతదేశాన్ని ''డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'' అని పిలుస్తారు, ఎందుకంటే ప్రపంచంలోని మొత్తం మధుమేహ రోగులలో 17 శాతం మంది భారతదేశంలో ఉన్నారు.
ఈ సంఖ్యలను బట్టి డయాబెటిస్ వ్యాధి ఎంత తీవ్రంగా విస్తరించబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) విడుదల చేసిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ జనాభాలో 31 శాతం మంది మధుమేహ వ్యాధితో జీవిస్తున్నారు. దేశ జనాభాలో ఎక్కువమందికి మధుమేహం ఉన్న దేశంగా పాకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది.
రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండి టైప్-2 డయాబెటిస్‌గా పరిగణించేంత ఎక్కువగా లేకుండా ఉండే పరిస్థితిని ''ప్రీ డయాబెటిస్'' అంటారు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోయినా, ఊబకాయాన్ని పెంచుకున్నా, శారీరక శ్రమ తక్కువగా ఉన్నా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు మధుమేహ వ్యాధిగ్రస్తులుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రీ-డయాబెటిక్ ఎలా డయాబెటిక్‌గా మారతారో చెప్పలేము. ''ప్రీ-డయాబెటిస్'' ఉన్నవారిలో మూడింట ఒక వంతు మందికి కొన్ని సంవత్సరాలలో మధుమేహ వ్యాధిగ్రస్తులుగా మారే అవకాశం ఉంది. మరొక మూడవ వంతు మంది ''ప్రీ-డయాబెటిక్స్''గానే కొనసాగవచ్చు. మిగిలిన మూడవ వంతు వారు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వ్యాయామంతో ''ప్రీ-డయాబెటిస్'' దశ నుంచి వెనుకకు పోయి సాధారణ స్థితికి రావచ్చని చెన్నైకి చెందిన మధుమేహ వైద్య నిపుణులు, 'మోహన్ డయాబెటిస్ సెంటర్' డాక్టర్ వి.మోహన్ తెలుపుతున్నారు.
ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి పెరగడం, ధూమపానానికి-మద్యపానానికి అలవాటు పడడం షుగర్ వ్యాధి ప్రబలడానికి ముఖ్యమైన కారణాలని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
మధుమేహం ఉన్నవారిలో సుమారు సగం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. వ్యాధి లక్షణాలను గుర్తించి, రక్త పరీక్ష చేసి షుగర్ ఉంది అని డాక్టర్ చెప్పినా కొద్దిమంది రోగులు ''మా వంశంలోనే ఎవరికీ లేదు షుగరు. నాకెలా వస్తుందండి...'' అని వాదిస్తుంటారు. షుగర్ రోగులలో చాలామందికి వంశపారంపర్య చరిత్ర ఉండదు. వంశపారంపర్య చరిత్ర ఉన్నవారికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరికి షుగర్ వ్యాధి ఉంటే బిడ్డలకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం సుమారుగా 30 శాతం వరకు ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ షుగర్ వ్యాధి ఉంటే బిడ్డలకు వచ్చే అవకాశం సుమారుగా 40 శాతం నుంచి 70 శాతం వరకు ఉంటుంది. వంశపారంపర్య షుగర్ చరిత్ర ఉండి, 30 సంవత్సరాల వయస్సు వచ్చిన వారందరూ ప్రతి సంవత్సరం రక్త పరీక్ష చేయించుకుని షుగర్ వ్యాధి వచ్చిందా లేదా అని నిర్ధారించుకోవడం అవసరం. ఇలా చేయగలిగితే షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు.
షుగర్ వ్యాధి రావడానికి వంశపారంపర్య చరిత్రతో పాటు ఎత్తుకు తగిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం, ఊబకాయం ఉండడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం, ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లు ఉండడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, శరీరానికి సరిపడా నిద్ర లేకపోవడం లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. వంశపారంపర్య చరిత్ర ఉన్నప్పటికీ జీవన శైలిలో అనుకూల మార్పులను ఆచరించగలిగితే వ్యాధి వచ్చే అవకాశాన్ని కొంతకాలం రాకుండా చూసుకోవచ్చు.
మధుమేహం, రక్తపోటు తరచుగా సహజీవనం చేస్తుంటాయి. మధుమేహం ఉన్నవారికి రక్త పోటు వచ్చే అవకాశం ఎక్కువ. రక్తపోటు ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు కాని వారికంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు రెండు రెట్లు అధిక రక్తపోటును కలిగి ఉంటారు. అధిక క్యాలరీల వినియోగంతో పాటు నిశ్చలమైన జీవనశైలి, ఇన్సులిన్ సున్నితత్వం, మధుమేహం వంటివి రక్తపోటుకు దారితీస్తాయి. మధుమేహ వ్యాధికి రక్తపోటు జతకడితే వచ్చే అనారోగ్య సమస్యలు సుమారు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే షుగర్ ఉన్న ప్రతి వ్యక్తి తరచుగా రక్తపోటును కూడా పరీక్షించుకోవాలి. షుగర్ అదుపులో పెట్టుకోవడమే కాదు రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవాలి.
ఎత్తుకు తగిన బరువు ఉండడం, పీచు పదార్థాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం, ఊబకాయం లేకుండా చూసుకోవడం, ధూమపానం-మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, ప్రతిరోజు శరీరం అలసిపోయే విధంగా కనీసం ఒక్క గంట పాటు వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజుకు ఆరు గంటలు నిద్ర ఉండే విధంగా చూసుకోవడం లాంటి ఆరోగ్య నియమాలను పాటించగలిగితే వంశపారంపర్య చరిత్ర ఉన్నప్పటికీ షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంటే కొంతకాలం పాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాన్ని వెనక్కి నెట్టవచ్చు. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించగలిగితే షుగర్ వ్యాధి వచ్చినా కానీ షుగర్ వ్యాధి వల్ల వచ్చే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. షుగర్ వ్యాధి వంశపారంపర్య చరిత్ర ఉన్న ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు నిండినప్పటి నుంచి ప్రతి సంవత్సరం షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వంశపారంపర్య చరిత్ర లేని వారు 40 సంవత్సరాలు నిండినప్పటి నుంచి తప్పక ఏడాదికి ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం రక్త పరీక్ష చేయించుకుంటే షుగర్ వ్యాధిని దాదాపుగా నాలుగు సంవత్సరాల ముందుగానే గుర్తించవచ్చు.
( వ్యాసకర్త ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు )
డా|| ఎం.వి. రమణయ్య