మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
భువనేశ్వర్ : ఒడిశాలో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బోలన్గిర్లో ఇద్దరు, అంగుల్, బౌద్, జగత్సింగ్పూర్, దేన్కనాల్, గజపతి, పూరీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ పట్టణాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. తుపానుతో పాటు రుతుపవనాలు కూడా తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. నారాజ్లో 13 సెంటీమీటర్లు, పిపిలిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. చెట్లు, నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరింది.