Nov 15,2023 07:13

తమ హిందూత్వ-బడా కార్పొరేట్‌ కూటమి ఎజెండాకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం తమ పనిగా నారాయణమూర్తి వంటి వారు పెట్టుకున్నారు. సంపదను సృష్టించడంలో తమ శ్రమశక్తిని, తమ నైపుణ్యాలను, తమ శారీరక, మానసిక సామర్ధ్యాలను ధారపోసే కార్మికుల పట్ల పెట్టుబడిదారులకు ఏమాత్రమూ గౌరవం ఉండదని, ఒక పని రోజులో కార్మికుడి నుండి ఎంత శ్రమశక్తిని గరిష్టంగా పిండుకోవాలో దాని గురించి మాత్రమే పెట్టుబడిదారుడు పట్టించుకుంటాడని మార్క్స్‌ చెప్పాడు. ఆ క్రమంలో కార్మికుల ఆయువు తగ్గిపోయినా పెట్టుబడిదారుడికి ఏ ఖాతరూ లేదు.

        ఇన్ఫోసిస్‌ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, ఐటి రంగ దిగ్గజం, శతకోటీశ్వరుడు అయిన నారాయణమూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని ఇటీవల పిలుపిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ యువత పని సంస్కృతిలో పెద్ద మార్పు రావాలని అన్నారు. ఇలా ఎక్కువ గంటలపాటు పని చేయాలని చెప్పడం ఆ పెద్దమనిషికి ఇదే మొదటిసారి కాదు. 2020లో వారానికి 60 గంటల పని ఉండాలని ప్రకటించారు. ప్రపంచ స్థాయి పోటీలో నిలదొక్కుకోవాలంటే ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలని, అప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతుందని, తనదైన ఒక నిర్ధారణకు నారాయణమూర్తి వచ్చారు. ఆ నిర్ధారణకు ఎటువంటి ప్రాతిపదికా లేదు. అతడి ఆలోచనలు మోడీ ప్రభుత్వపు భ్రష్టు పట్టిపోయిన దృక్పధాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి.
         ''భారతదేశంలో శ్రామిక ఉత్పాదకత ప్రపంచం లోనే అతి తక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి భారతీయులందరూ క్రమశిక్షణను అలవరచుకుని పనిలో ఉత్పాదకతను పెంచాలి'' అని నారాయణమూర్తి నొక్కి వక్కాణించారు. వెంటనే అతడి ప్రకటన మీడియాలో వైరల్‌ అయింది. ఆ వెంటనే భవిష్‌ అగర్వాల్‌ (ఓలా క్యాబ్స్‌ అధినేత), సజ్జన్‌ జిందాల్‌ (జిందాల్‌ స్టీల్‌ వర్క్స్‌ అనే బహుళజాతి పారిశ్రామిక గ్రూపు చైర్మన్‌) వంటి వారు ఆ ప్రకటనను స్వాగతిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
        ప్రస్తుతం మన దేశంలో ఉనికిలో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం మన కార్మికులు వారానికి 48 గంటలపాటు పని చేయాలి. వారంలో ఒకరోజు శలవు ఉంటుంది. తక్కిన దేశాల్లో ఉన్న నిబంధనలతో పోల్చితే మన కార్మికులు ఇప్పటికే అధిక పని భారం మోస్తున్నారన్న చేదు నిజం కానవస్తుంది. ఐఎల్‌వో 2023లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కార్మికులు వారానికి సగటున 47.7 గంటల పాటు పని చేస్తున్నారు. అదే అమెరికాలోనైతే సుమారు 36.4 గంటలు, దక్షిణ కొరియాలో 37.9 గంటలు, రష్యాలో 37.6 గంటలు, బ్రిటన్‌ లో 36 గంటలు, జర్మనీలో 37 గంటలు సగటున పని చేస్తున్నారు.
        ప్రపంచం లోనే ఎక్కువ పని గంటలు అమలు అవుతున్న దేశాల్లో భారతదేశం ఐదవ స్థానంలో ఉందని ఐఎల్‌వో నివేదిక వెల్లడిస్తోంది. మనకన్నా ఎక్కువ పనిగంటలు అమలౌతున్న దేశాలు గాంబియా, మంగోలియా, మాల్దీవులు, కతార్‌. ఈ దేశాల్లో ఎక్కువమంది కార్మికులు భారతదేశం నుండి వలస పోయినవారే. అదే సమయంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం మొత్తంలో అతి తక్కువ వేతనాలు పొందుతున్న వారు భారతీయ కార్మికులే. ఒక్క బంగ్లాదేశ్‌ లో మాత్రమే కనీసవేతనాలు మనకన్నా తక్కువ ఉన్నాయి. 2020-21కి సంబంధించి ప్రపంచ వేతనాల నివేదిక ఈ వాస్తవాలను తెలియజేసింది.
        ఆ యా దేశాల్లో అమలు జరిగిన పారిశ్రామికీ కరణ స్థాయి, దాని వేగం, అక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలను పరిగణన లోకి తీసుకోకుండా వేరు వేరు దేశాల కార్మికుల ఉత్పాదకతను పోల్చి చూడడం శాస్త్రీయత అనిపించుకోదు. కాని, ఒక సగటు భారతీయ కార్మికుడు ఒక జపాన్‌ కార్మికుడికన్నా, లేదా ఒక జర్మనీ కార్మికుడికన్నా తక్కువ పని చేస్తాడని నారాయణమూర్తి చెప్తున్నదానికి ఏ ఆధారమూ లేదు. 1970లో భారతీయ కార్మికుడు సగటున ఏడాదికి 2077 గంటలు పని చేశాడు. అదే ఏడాదిలో జర్మన్‌ కార్మికుడి సగటు 1941 గంటలు ఉంటే జపాన్‌ కార్మికుడు 2137 గంటలు పని చేశాడు. అదే 2017 నాటికి భారతీయ కార్మికుడి ఏడాది సగటు 2117 గంటలు ఉంటే జపాన్‌ లో 1738 గంటలు, జర్మనీలో 1354 గంటలు ఉంది. జర్మన్‌ కార్మికుల కన్నా, జపాన్‌ కార్మికుల కన్నా మన కార్మికులు తక్కువ కష్టపడతారన్నది కేవలం దురభిప్రాయం మాత్రమే అని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
         మన ప్రభుత్వం 2019లో ప్రచురించిన నివేదిక ప్రకారం 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పట్టణ కార్మికులు సగటున ఒక్కొక్కరు రోజుకు 521 నిముషాలు చొప్పున, వారానికి 60 గంటల 47 నిముషాల చొప్పున పని చేస్తున్నారు. ఐఎల్‌వో నిర్దేశించిన వారానికి 48 గంటల పరిమితిని దాటిపోయి మన కార్మికులు పని చేస్తున్నారు. పని దినం నిడివిని బాగా పెంచి మన పెట్టుబడిదారులు ఎంత దారుణంగా కార్మికుల శ్రమను కొల్లగొడుతున్నారో ఈ వివరాలు వెల్లడి చేస్తున్నాయి. ''ఆకలిగొన్న తోడేళ్ళ'' మాదిరిగా పెట్టుబడిదారులు కార్మికులనుండి అదనపు విలువను గుంజుతారని మార్క్స్‌ అన్నాడు. ఈ కొల్లగొట్టే క్రమంలో వాళ్ళకి నైతికంగా ఏ సంకోచమూ ఉండదు. అంతే గాక, కార్మికుల శారీరక శక్తికి ఉండే పరిమితులను సైతం పట్టించు కోకుండా పెట్టుబడిదారులు చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. మన కార్మికులు తమ ఉత్పాదక తను బాగా పెంచుకోవాలని, ప్రపంచంలోనే అతి తక్కువ ఉత్పాదకతతో మన కార్మికులు పని చేస్తున్నారని నారాయణమూర్తి అంటున్నది ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నదానికి పూర్తి భిన్నంగా ఉంది. 2000-2013 మధ్య ఆసియన్‌ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్‌(ఎపిఓ)లో సభ్య దేశాలుగా ఉన్న 20 దేశాలలో శ్రామిక ఉత్పాదకతలో అత్యంత ఎక్కువగా పెరుగుదలను చైనా కార్మికులు నమోదు చేశారు. వారి ఉత్పాదకత 9.0 శాతం చొప్పున పెరిగింది. ఆ తర్వాత మంగోలియా లో 5.5 శాతం, ఇండియాలో 5.2 శాతం, లావోస్‌లో 4.6 శాతం, వియత్నాంలో 4.4 శాతం, కాంబోడియాలో 4.5 శాతం, శ్రీలంకలో 4.1 శాతం, ఇండోనేషియాలో 3.5 శాతం చొప్పున శ్రామిక ఉత్పాదకత పెరిగింది. అంటే ఇండియా ఎపివో దేశాలలో ఉత్పాదకత విషయంలో మూడో స్థానంలో ఉంది.
          ఇక వారానికి 70 గంటలపాటు పని చేస్తే దాని ప్రభావం వృత్తిపరంగా సామర్ధ్యాన్ని ఎంత దెబ్బ తీస్తుందో, కార్మికుల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం పడుతుందో, పనికి, కుటుంబ జీవితానికి మధ్య ఉండవలసిన సమతూకం ఎంత దెబ్బ తింటుందో ఆ విషయాలేమీ మన కార్పొరేట్‌ మీడియా పట్టించుకోనేలేదు. నయా ఉదారవాద మేథావులతోబాటు చాలామంది ఉదారవాదులు సైతం నారాయణమూర్తికి వంత పాడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐఎల్‌వో ఆధ్వర్యంలో ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ తన అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం పని గంటలను పొడిగించడం వలన 2000 -2016 సంవత్సరాల మధ్య గుండె పోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులబారిన పడ్డ కార్మికుల సంఖ్య 29 శాతం పెరిగింది. ఈ కాలంలో 7,45,000 మరణాలు పనిగంటల పొడిగింపు కారణంగా సంభవించాయి. 2016లో 3,98,000 మంది గుండెపోటు వలన, మరో 3,47,000 మంది గుండె సంబంధిత వ్యాధుల వలన మరణించారని, వారానికి కనీసం 55 గంటల మేరకు పని వేళలను పొడిగించిన కారణంగా ఈ మరణాలు సంభవించాయని ఆ నివేదిక తెలియజేసింది. పని గంటలను పొడిగించినందువలన వృత్తి సంబంధిత మరణాలు అదనంగా మరో మూడో వంతు మేరకు పెరుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు ఎక్కువ గంటలపాటు పని చేసేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో ఇప్పుడు 9 శాతం ఉంది. అంటే పని గంటల పెంపు కారణంగా రాబోయే కాలంలో మరణాలు ఇంకా పెరగనున్నాయి.
ఉత్పత్తిని పెంచడం మీద, అదనపు విలువను కార్మికులనుండి కొల్లగొట్టడం మీద ప్రధానంగా పెట్టుబడిదారీ వర్గం దృష్టి పెడుతుందని, దాని ఫలితంగా సహజంగా పెంపొందవలసిన మానవ శ్రమ స్వభావం దెబ్బ తింటుందని, కార్మికుల శక్తి సామర్ధ్యాలు తొందరగా హరించుకుపోయి మానవ శ్రమశక్తే అంతరించిపోతుందని కార్ల్‌మార్క్స్‌ చెప్పినది ఎంత సత్యమో ప్రస్తుత అనుభవాలు రుజువు చేస్తున్నాయి.
అడ్డూ, ఆపూ లేకుండా పనిగంటలను ఇష్టం వచ్చినట్టు పెంచివేయడానికి మోడీ ప్రభుత్వం చట్టపరంగా ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించింది. బానిసత్వపు దశతో పోల్చదగ్గ పరిస్థితి ఇది. మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లలో పని గంటలమీద గరిష్ట పరిమితిని ఎక్కడా విధించలేదు. 8 గంటల పని దినం గురించిన ప్రస్తావన కూడా లేదు. ఆ యా ప్రభుత్వాల ఇష్టాలకు ఈ అంశాన్ని విడిచిపెట్టింది. ఐతే కార్మిక సంఘాలు పదే పదే అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం చాలా అయిష్టంగా కొన్ని నిబంధనలను చేర్చింది. కాని వాటికి అనేక మినహా యింపులు చేయడానికి అవకాశాలు కూడా ఇచ్చింది.
ఫ్యాక్టరీ చట్టం ప్రకారం రోజులో పదిన్నర గంటల వ్యవధిలో ఎనిమిది గంటల పాటు పని చేయించుకునే అవకాశం యజమానులకు ఉంది. దానిని కాస్తా ఇప్పుడు 12 గంటలకు పెంచారు. ప్రతీ ఆదివారమూ శలవు ఉండాలనే నిబంధనను మోడీ ప్రభుత్వం తొలగించింది. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన లేబర్‌ కోడ్‌ ఆ యా ప్రభుత్వాలు తమ కార్మికుల పని గంటలను ఎంతవరకైనా పొడిగించుకోవచ్చు నని అవకాశం ఇచ్చింది. మూడు నెలల కాలంలో 125 గంటలవరకూ ఓవర్‌టైమ్‌ చేయించుకోడానికి ముసాయిదా నిబంధనలు అవకాశం ఇస్తున్నాయి. ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకు 12 గంటలవరకూ పని గంటలను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చాయి. కార్మికులనుండి తీవ్రంగా ప్రతిఘటన వచ్చాక వెనక్కి తగ్గాయి. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలు ఇచ్చాయి. ఐతే ఆ రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో మళ్ళీ వెనక్కి తగ్గాయి.
          తమ హిందూత్వ-బడా కార్పొరేట్‌ కూటమి ఎజెండాకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం తమ పనిగా నారాయణమూర్తి వంటి వారు పెట్టుకున్నారు. సంపదను సృష్టించడంలో తమ శ్రమశక్తిని, తమ నైపుణ్యాలను, తమ శారీరక, మానసిక సామర్ధ్యాలను ధారపోసే కార్మికుల పట్ల పెట్టుబడిదారులకు ఏమాత్రమూ గౌరవం ఉండదని, ఒక పని రోజులో కార్మికుడినుండి ఎంత శ్రమశక్తిని గరిష్టంగా పిండుకోవాలో దాని గురించి మాత్రమే పెట్టుబడిదారుడు పట్టించుకుంటాడని మార్క్స్‌ చెప్పాడు. ఆ క్రమంలో కార్మికుల ఆయువు తగ్గిపోయినా పెట్టుబడిదారుడికి ఏ ఖాతరూ లేదు.
పెట్టుబడికి, శ్రమకు నడుమ ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ సారాంశం ఇదే.

/ వ్యాసకర్త సిఐటియు జాతీయ కార్యదర్శి /
( స్వేచ్ఛానుసరణ )
ఆర్‌. కరుమలయన్‌

photo