Jun 11,2023 13:17

ఐర్లాండ్‌లోని గ్రేస్టోన్‌ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో, ఇళ్లలో, ప్రతిచోటా ఫోన్‌లను నిషేధించాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ కోరుతోంది. ఈ నిషేధం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడుతుందని ఆ పట్టణ పౌరులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల అమాయకత్వాన్ని ఎంత కాలం కాపాడుకోగలిగితే అంత మంచిదని, స్మార్ట్‌ఫోన్‌లు పిల్లలను అడల్ట్‌ కంటెంట్‌ వైపు దృష్టి మళ్లిస్తున్నాయనే ఉద్దేశ్యంతోనే తల్లిదండ్రులు ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అధిక మొబైల్‌ వాడకం వల్ల పిల్లల జీవనశైలి మారిపోతుందని.. వీటి కారణంగా ఊబకాయం, ఆకలి లేకపోవడం, చిరాకు వంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వర్చువల్‌ ప్రపంచం అంటే స్క్రీన్‌ ముందు ఎక్కువ సమయం గడపడం ద్వారా, పిల్లలు క్రీడలు, శారీరక శ్రమ, వ్యక్తులతో సంభాషించడం, జీవితంలో ఉపయోగపడే అనేక నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్‌ అందజేయడం వల్ల వారి మానసిక వికాసం దెబ్బతింటున్నదని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మార్చి 2022లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం... భారత్‌లోని 24 శాతం మంది పిల్లలు నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌లను తనిఖీ చేస్తున్నారని, 37శాతం మంది పిల్లలు ఏకాగ్రతతో పోరాడుతున్నారని భారత ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో నివేదించింది. అందువల్ల చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని, పిల్లల మానసిక వికాసం పెంపొందించే వైపు వారిని ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు.