ఉల్లి లేకుండా మన ఇంట్లో కూర ఏదీ అవ్వదు. ఇంకా మనవాళ్లయితే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లికి మనమిచ్చే ప్రాధాన్యత అలాంటిది మరి. ఉల్లి లేకుండా బిర్యానీ లేదు.. పెరుగు చట్నీ అసలే లేదు. ఇంతలా మన నిత్యజీవితంతో పెనవేసుకున్న ఉల్లి చరిత్ర ఏమిటో? ఎలా? ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉల్లి పండిస్తారు. యాలె యూనివర్సిటీలోని బాబిలోనియా కలెక్షన్‌లో మూడు మట్టి ఫలకాలున్నాయి. వంటలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత పురాతన పుస్తకాలు ఇవేనంటారు. నాలుగు వేల ఏళ్ల కిందట చిత్రలిపిలో లిఖించిన వీటిలోని అనేక విషయాలు 1985 వరకు వెలుగు చూడలేదు. ఫ్రాన్స్‌కు చెందిన అసిరియాలజిస్ట్ (చిత్రలిపిని విశ్లేషించేవారు). కుక్ అయిన జీన్ బొటెరో ఆ ఫలకాలపై ఏం రాసిందనేది తేల్చారు. నాలుగు వేల ఏళ్ల కిందట నుంచే మెసపటోమియాలో ఉల్లిని వినియోగించినట్లు ఆధారాలున్నాయి. మెసపటోమియన్లు ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉల్లి కాడలు వంటివన్నీ ఉపయోగించినట్లు తెలుస్తోంది. నాలుగు వేల ఏళ్ల తరువాత ఇప్పుడూ ఉల్లికున్న ఆదరణ తక్కువేమీ కాదు. ఉల్లి లేని వంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 175 దేశాలలో ఉల్లి పండిస్తారు. గోధుమ పండించే దేశాలతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపు. అనేక ప్రత్యేక వంటకాలలో ఉల్లిని వాడతారు. కొందరైతే ఉల్లిని విశ్వ ఆహారంగా అభివర్ణిస్తుంటారు.
ఎక్కడి నుంచి వచ్చింది ?
ఉల్లి జన్యు విశ్లేషణ ఆధారంగా మధ్య ఆసియా నుంచి ప్రపంచమంతా వ్యాపించినట్లు చెప్పొచ్చని ఫుడ్ హిస్టోరియన్ లారా కెల్లీ చెప్పారు. మెసపటోమియాలో ఉల్లి వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఉండడంతో సెంట్రల్ ఆసియా నుంచి అక్కడికి వెళ్లినట్లు భావిస్తున్నారు. మరోవైపు కాంస్య యుగంలో యూరప్ ఖండంలోనూ ఉల్లి వినియోగం ఉన్నట్లు ఆధారాలున్నాయి. '2000 ఏళ్ల కిందట సిల్క్ రోడ్‌లో ఉల్లి రవాణా జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అప్పటికే మెసపటోమియన్లు వారి ఉల్లి వంటకాల చరిత్రను లిఖిస్తున్నారు' అని కెల్లీ తన ''సిల్క్ రోడ్ గోర్మెట్'' పుస్తకంలో రాశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తవుతున్న ఉల్లిలో 45 శాతం భారత్, చైనాలోనే పండుతోంది. అయితే, ఉల్లి తలసరి వినియోగం అత్యధి కంగా ఉన్న దేశాలు ఈ రెండూ కావు.
ఉల్లి తలసరి వినియోగం లిబియాలో అత్యధికంగా ఉంది. 2011లో లిబియా ప్రజల తలసరి ఉల్లి వినియోగం ఏడాదికి సగటున 33.6 కేజీలని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెప్తున్నాయి. లిబియాలో ప్రతి వంటకంలోనూ ఉల్లి ఉపయోగిస్తారని చెప్తారు. 2011 లెక్కల ప్రకారం ఉల్లి తలసరి వినియోగంలో లిబియా తరువాత అల్బేనియా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి.
మరోవైపు ఫ్రాన్స్ ప్రజలు ఎక్కువగా ఉల్లి తింటారని భావిస్తారు. కానీ, ఫ్రెంచ్ ప్రజల తలసరి ఉల్లి వాడకం 5.6 కేజీలు. మన దేశంలో 1998లో ఉల్లి ధరల పెరుగుదలతో ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలూ ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
పోషకాలేమిటి ?
ఉల్లి తక్కువ కాలరీలుండే ఆహారమని డైటీషియన్ డాక్టర్ అర్చనా గుప్తా చెప్పారు. అందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని చెప్పారు. 100 గ్రాముల ఉల్లిలో నాలుగు మిల్లీ గ్రాముల సోడియం, ఒక మిల్లీగ్రామ్ ప్రోటీన్, 9 నుంచి 10 మిల్లీ గ్రాముల కార్బోహైడ్రేట్స్, మూడు మిల్లీ గ్రాముల ఫైబర్ ఉంటుందని ఆమె చెప్పారు.
మీకు తెలుసా ?
ప్రపంచంలో అతి పెద్ద ఉల్లిపాయ 2015లో పండింది. బ్రిటన్‌లోని లీస్టర్స్ షైర్‌లో పండిన ఈ ఉల్లిపాయ బరువు 8.49 కేజీలు. ఉల్లిలో 85 శాతం నీరు. ఉల్లిపాయని కోసేటప్పుడు 'సిన్ ప్రొపనెథియల్ ఎస్ ఆక్సైడ్' అనే రసాయనం విడుదలవుతుంది. ఇది కళ్ల కొనల్లో ఉండే లాక్రిమల్ గ్రంథులను ఉత్తేజితం చేయడంతో కన్నీళ్లు వస్తాయి.