Nov 15,2023 07:15

          బ్రిటన్‌లో అసహ్యకరమైన విభజన, విద్వేష రాజకీయాలను బాహాటంగా ప్రేరేపించిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌కు సునాక్‌ ఉద్వాసన పలకడం స్వాగతించదగ్గ పరిణామం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీలో సునాక్‌ నాయకత్వాన్ని సవాల్‌చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ ఆఫ్రికన్‌-భారతీయ సంతతి మహిళ డౌన్‌స్ట్రీట్‌ నంబర్‌ 10ను ధిక్కరించి 'టైమ్స్‌'లో రాసిన వ్యాసంతో మొదలైన వివాదం ఆమె నిష్క్రమణ తరువాత కూడా సమసిపోయేలా లేదు. బ్రేవర్‌మన్‌ రాసిన ఆ వ్యాసంలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని క్రూరంగా అణచివేయడంలో మెట్రో పోలీసులు అలసత్వం వహించారని నిందించారు. అంతటితో ఆగలేదు, ఆ ప్రదర్శనలో పాల్గొన్నవారంతా ఇస్లామిక్‌ ఉగ్రవాద గ్రూపులు, హమాస్‌తో సంబంధమున్నవారేనని అవాకులు చవాకులు పేలారు. ఆమె వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడం, గత శనివారం బ్రిటన్‌లో లక్షలాది మందితో జరిగిన ర్యాలీలో బ్రేవర్‌మన్‌ను తక్షణమే తొలగించాలన్న నినాదాలు హోరెత్తడం, పార్టీలో అంతర్గత ముఠా కుమ్ములాటలు వెరసి ఆమె ఉద్వాసనకు కారణమయ్యాయి. అంతే తప్ప వీరి మధ్య సైద్ధాంతికపరమైన విభేదాలేమీ లేవు. పేచీ అంతా ఆ ఉద్యమాన్ని ఎప్పుడు, ఎలా అణచివేయాలన్నదానిపైనే. భద్రత పేరుతో నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు నిరంకుశ పబ్లిక్‌ ఆర్డర్‌ యాక్ట్‌ను ఇద్దరూ కూడబలుక్కుని తీసుకొచ్చారు.. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని లక్షలాది మంది నినదిస్తుంటే సునాక్‌ ఇజ్రాయిల్‌ వెళ్లి నెతన్యాహు ప్రభుత్వానికి వత్తాసు పలికి వచ్చారు. దేశంలో ప్రైవేటీకరణ, నిరుద్యోగం, పడిపోతున్న నిజవేతనాలు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు సమ్మెలు, ఆందోళనలకు దిగుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం రాజకీయ అస్థిరతకు దారి తీసింది. ఏడాది వ్యవధిలోనే ముగ్గురు ప్రధానులు మారడం ఇందుకొక సంకేతం. కన్సర్వేటివ్‌ ప్రభుత్వం పట్ల బ్రిటిష్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సునాక్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ డ్రామాకు తెర లేపారు. మంత్రివర్గం నుంచి బ్రేవర్‌మన్‌ను తొలగించిన వెంటనే న్యూ కన్సర్వేటివ్‌ ఫ్యాక్షన్‌ సమావేశమై ఆమె నాయకత్వాన్ని పటిష్టపరచే యత్నాలు చేపట్టినట్టు 'ది గార్డియన్‌' పత్రిక కథనం రాసింది. సునాక్‌ నాయకత్వానికి సొంత పార్టీ నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయని 'మెయిల్‌' వ్యాఖ్యానించింది. బ్రేవర్మన్‌ హోం మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి. లిజ్‌ట్రస్‌ మంత్రివర్గం నుంచి కూడా ఆమె గతంలో ఒకసారి తప్పుకున్నారు. పలు కీలకాంశాలపై ట్రస్‌ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగానే విమర్శించడం అప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపికి చూపించిన అంశంలో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
           'బ్రిటన్‌లో వీసా కాలపరిమితి ముగిసిన వలసవాసులను రువాండాకు తరలిస్తాం. శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్ర' లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కన్జర్వేటివ్‌ పార్టీలో కరడుగట్టిన మితవాదులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారామె. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఒపీనియన్‌ పోల్స్‌ కన్సర్వేటివ్‌ పార్టీ పలుకుబడి బాగా పడిపోతున్నట్లు వెల్లడిస్తున్నాయి. సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు మాజీ ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ను అనూహ్యమైన రీతిలో మంత్రి వర్గంలోకి సునాక్‌ తీసుకున్నారు. 2016 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిని హడావుడిగా ఎగువ సభ సభ్యత్వం ఇచ్చి విదేశాంగ మంత్రిగా నియమించారు. ఇప్పటివరకు విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్‌ క్లెవరీని హోం మంత్రిగా నియమించారు. బ్రెగ్జిట్‌పై రిఫరెండమ్‌ తనకు వ్యతిరేకంగా రావడంతో 2016లో పదవి నుంచి తప్పుకున్న కెమరాన్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి విదేశాంగమంత్రిగా నియమించడం వల్ల సునాక్‌ ప్రతిష్ట మరింత మసకబారుతుందే తప్ప మెరుగుపడదు. కన్సర్వేటివ్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ కూడా నెతన్యాహును వెనకేసుకొస్తున్నది. రేపు లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. ఈ రెండు పార్టీల వ్యవస్థను బద్దలు కొట్టి వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో మరో ప్రత్యామ్నాయం నిర్మించడమే మార్గం. బ్రిటన్‌లో నేడు సాగుతున్న ప్రజా ఉద్యమాలు అటువంటి మార్పులకు దారి తీస్తాయని ఆశిద్దాం.