'భూమి మీద పుట్టిన ప్రతిఒక్కరూ కాలాన్ని అనుసరిస్తూ నడవాల్సిందే. దీని ప్రాముఖ్యంగా తీసిన సినిమా 'బ్రో'. జాతి, కులం, మతం భేదం లేకుండా చూడొచ్చు' అంటున్నాడు దర్శకుడు సముద్రఖని. మేనమామ-మేనల్లుడు.. పవన్‌కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో పి. సముద్రఖని రూపొందించిన చిత్రం 'బ్రో'. జులై 28న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను ప్రేక్షకులతో పంచుకున్నారు సముద్రఖని.
'చిన్నప్పటి నుంచి నటుడు కావాలని ఆసక్తి ఉండేది. 1992లో పరిశ్రమలోకి అడుగుపెట్టా. టీవీలో 'మర్మదేశం-ఎదువుం నడుక్కం' తమిళ సీరియల్లో నటించా. వెయ్యికి పైగా ఎపిసోడ్స్ నడిచింది. 1998లో కె విజయన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. కె. బాలచందర్ నూరవ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. 2001లో 'పార్థాలే పరవశం' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 2003లో 'ఉన్నై చరణదా ఇందెన్' సినిమా ద్వారా దర్శకుడిగా మారాను. చాలా పాత్రలకు డబ్బింగ్ చెప్పాను, చెబుతున్నాను. అవసరమైనప్పుడు సినిమాల్లో పాటలు పాడుతున్నాను. ఏ పని చేసినా తక్కువగా ఫీలవ్వను. పనిని ప్రేమించాలని మా గురువు బాలచందర్ అంటుంటారు. ఆయనతో కలిసి 2004లో ఒక డ్రామా చూశాను. ఎలా ఉందని ఆయన అడిగితే, ''బాగుంది సార్! కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది'' అన్నాను. అప్పటి నుంచి ఆ కథ నాతో పయనిస్తూనే ఉంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని, 17 ఏళ్ల తర్వాత ''వినోదయ సిత్తం'' సినిమా తమిళంలో తీశాను.
చెన్నైకి 600 కీ.మీ. దూరంలో మా ఊరు ఉంది. ఇంటికి వెళ్లాలంటే 200 మీటర్లు నడిచి వెళ్లాలి. ఇంటివరకూ కారు వెళ్లదు. అలాంటి ఊరిలో పుట్టి, పెరిగిన నేను ఈ స్థాయికి ఎదిగానంటే సమాజం నాకు చాలా ఇచ్చింది. అందుకే సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా నా సినిమా ఉండాలనుకున్నా. అందులోనూ కాలాన్ని గురించి అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నా. జీవితంలో ఎన్నో విషయాలను పరిచయం చేసే టైంకి ఎంతో విలువనివ్వాలి. ఆ ఉద్దేశంతో 'బ్రో' సినిమా రూపొందించాం. ఓ రోజు కారులో ప్రయాణిస్తుండగా సిగల్ పడింది. నా వాహనం పక్కనే చిన్న, పెద్ద వాహనాలు ఆగాయి. కానీ ఏ ఒక్కరి ముఖంలో ప్రశాంతత లేదు. ఏదో టైం అయిపోతుందన్న ఒత్తిడితో ఆ ముఖాలన్నీ కనిపించాయి. అలాంటి వారందరి కోసం ఈ సినిమా తీశాను. ప్రతి ఒక్కరికీ కనక్ట్ అవుతుంది. కుల, మత, జాతి భేదం లేకుండా అందరూ ఈ సినిమా చూడవచ్చు. దర్శకుడిగా ఇది నా 15వ సినిమా. నిరంతరం ఏదో ఒక పని చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తాను. 'బ్రో' ఫిల్మ్ మేకింగ్ పూర్తయ్యాక వెంటనే వేరే సినిమాలో నటించేందుకు వెళ్లాను. నటన వైపు అడుగులు వేశాక నా రెండో సినిమా ప్లాప్ అయ్యింది. కానీ నేను బాధపడలేదు. వెంటనే ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఎందుకంటే? ఇది కాకపోతే ఇంకో పని చేసుకుని బతుకుదాం అనే ఆలోచనతో ముందుకెళతాను. అదే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను సమిష్టి కృషిని నమ్ముతాను. తెలుగు నేటివిటీ మీద త్రివిక్రమ్‌కి ఉన్న పట్టు నాకు లేదు. అందుకే ఆయనతో కలిసి ఈ సినిమా తీశాం. మాతృకలోని ఆత్మని తీసుకొని, పవన్‌కళ్యాణ్ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మార్పులు చెప్పారు. దానికి అనుగుణంగా సినిమా చేశాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల ఎంతో సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు'.
పేరు : సముద్రఖని పాండియారాజ్
పుట్టిన తేది : 26 ఏప్రిల్ 1973
పుట్టిన ప్రాంతం : సీతూర్, రాజపాళయం,తమిళనాడు.
భార్య : జయలక్ష్మి
పిల్లలు : ఒక కూతురు,
ఒక కొడుకు.
వృత్తి : తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు. దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.