Oct 08,2023 11:17

సైన్సు అంటేనే పరిశోధన.. కనుగొనటం.. నిరూపించటం.. అని మనకు తెలిసిందే. అయితే ఈ పరిశోధన పరిమితి లేని విషయంగా.. ప్రతిసారీ ఆశ్చర్యపరిచేదిగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడూ అలాంటి విషయమే ఇక్కడ పేర్కొనటం. ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం రిడ్లీ తాబేళ్లు ఉండేవి. వాటి డిఎన్‌ఎ అవశేషాలతో ఒక శిలాజం బయటపడింది. దీని వెన్నుపూసలోని జన్యుపదార్థం (డిఎన్‌ఎ కణాలు) గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న కెంప్స్‌ రిడ్లీ, ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లకూ దీనికీ దగ్గరి సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సకశేరుక పురాతన శిలాజాలలో జన్యు పదార్థం గుర్తించటం అరుదైన విషయంగా పరిశోధకులు చెబుతున్నారు.
సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన టైరన్నోసారస్‌, ఏడు కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన బ్రాచైలోఫోసారస్‌ సకశేరుక శిలాజాలు రెండింటినీ గుర్తించారు. అవి డైనోసార్‌లకు చెందిన సకశేరుక పురాతన శిలాజాలవిగా ఇంతకుముందే గుర్తించడం విశేషం. ఈ విషయాన్ని స్మిత్సోనియన్‌ ట్రాపికల్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌కు చెందిన పాలియోంటాలజిస్ట్‌ ఎడ్విన్‌ కాడెనా వివరించారు. అంతేకాక కోటి సంవత్సరాల క్రితంనాటి కీటకాల డిఎన్‌ఎ అవశేషాలు కూడా సేకరించినట్లు కాడెనా చెప్పారు.

1


పనామా కరేబియన్‌ తీరంలో జరిపిన తవ్వకాలలో లభించిన ఈ శిలాజంలో ఆస్టియోసైట్‌లు అనే కొన్ని ఎముక కణాలు అంత భద్రంగా ఉండటం అద్భుతమే అంటున్నారు. ఆస్టియోసైట్‌లలో ఉన్న న్యూక్లియై కణాలు రసాయన ద్రావణానికి ప్రతిస్పందించాయి. అప్పుడు డిఎన్‌ఎ అవశేషాల ఉనికి గుర్తించడం జరిగింది. దీనిద్వారా జీవి అభివృద్ధి, ఇతర చర్యలు, జన్యు సమాచారం తెలుసుకున్నారు. శిలాజం పాక్షికంగా ఉంది. జీవించినప్పుడు ఈ తాబేలు అడుగు (30 సెం.మీ.) పొడవు ఉండేదని తెలిసింది. ఇదీ కాడెనా అధ్యయనంలో తేలింది. అయితే 'మేము డిఎన్‌ఎను సంగ్రహించలేదు. కేంద్రకంలోని డిఎన్‌ఎ ఉనికిని మాత్రమే గుర్తించగలిగాము' అని బొగోటాలోని యూనివర్సిడాడ్‌ డెల్‌ రోసారియో పరిశోధకులు, కాడెనా కించిత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచంలో లెపిడోచెలిస్‌ జాతికి చెందిన ఏడు జీవ జాతుల సముద్ర తాబేళ్లలో కెంప్స్‌ రిడ్లీ, ఆలివ్‌ రిడ్లీ రెండు రకాలు. వీటిలో అతి చిన్నది ఆలివ్‌ రిడ్లీ. త్రిభుజాకారపు తల, కొక్కెంలాంటి ముక్కుతో ఉండే కెంప్స్‌ రిడ్లీ మెక్సికోలో కనిపిస్తుంది. దాదాపు అవే పోలికలతో ఉండే ఆలివ్‌ రిడ్లీ పసిఫిక్‌, ఇండియన్‌, అట్లాంటిక్‌ మహాసముద్రాలలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది.

2


'పరిశోధనలో ఉన్న శిలాజం అవశేషాలు కొంత అసంపూర్తిగా ఉన్నాయి. డిఎన్‌ఎ ద్వారా కొంత సమాచారం తెలిసినప్పటికీ దీని జాతిని పైన పేర్కొన్న రిడ్లీ జాతేనని కచ్చితంగా నిర్ణయించలేము. జాతిని చెప్పేంత స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. డిఎన్‌ఎ అతి చిన్న ముక్కలను అదే లక్షణాలతో పోలికలున్న జీవులతో అనేక రకాలుగా పోల్చిగానీ, భవిష్యత్తులో పరమాణు పరిణామ అధ్యయనంలోనో మరింత సమాచారం అందిస్తామని' కాడెనా అంటున్నారు.