Aug 20,2023 12:39

తన బైకు ఆగగానే ప్రతిరోజూ పరుగెత్తుకు వచ్చే 'రాకీ' ఆ రోజు రాకపోయేసరికి కృష్ణమూర్తి దాని కోసం చుట్టుపక్కల చూశాడు. రాకీ ఎంతకీ కనిపించకపోయేసరికి అతని మనసు ఏదోలా అయిపోయింది. అప్పటికే బండి మీద నుంచి దిగిన కృష్ణమూర్తి భార్య రాకీ కోసం చుట్టూ ఆత్రంగా చూసింది. కృష్ణమూర్తి బైకు స్టాండ్‌ వేసి, కాసేపు అలాగే తన ఇంటి ముందు భార్యతో పాటు నిల్చుండిపోయాడు.
బైటకి వెళ్లొచ్చిన భార్యభార్తలిద్దరూ రాకీ కోసం అలా చాలాసేపు అలా కళ్లల్లో ఒత్తులేసుకుని అక్కడే తమ ఇంటి ముందు ఆశగా ఎదురుచూశారు. రాకీ ఎంతకీ రాకపోయేసరికి కృష్ణమూర్తి మనసు ఏదో కీడుని శంకించింది.
అప్పుడు సుమారుగా రాత్రి పది గంటలు కావస్తోంది. అక్కడేవున్న వీధిలైటు మిణుకు మిణుకుమంటూ వెలిగి, ఆరిపోతోంది. కృష్ణమూర్తి జేబులోంచి సెల్‌ ఫోన్‌ తీసి టార్చ్‌ వేసి, ఆ కాంతి వెలుగులో కళ్లు పెద్దవి చేసుకుని.. ఇంటి చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు. రాకీ ఉనికి ఎక్కడా కానరాలేదు.
కృష్ణమూర్తి చెవులకు దూరంగా వున్న పొదల్లో చిన్నగా శబ్దం విన్పించగా, అటువైపుగా అడుగులు వేశాడు. అతని గుండెల్లో ఏదో తెలియని గుబులు. అతని కాళ్లల్లో సన్నగా వణుకు మొదలైంది. తన అనుమానం నిజం కాకూడదు అనుకుంటూనే తన ఇంటి సమీపంలోనున్న పొదలు దగ్గరగా వెళ్ళాడు. టార్చ్‌లైట్‌ వెలుగుతో నిశితంగా చూశాడు. అతని భయం నిజమైంది. అక్కడ ఆయాసంతో చిన్నగా రొప్పుతూ రాకీ పడి వుంది.
రాకీ ఒళ్లంతా గాయాలతో రక్తం ఓడుతోంది. కృష్ణమూర్తికి రాకీని ఆలా చూడగానే ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఆ దృశ్యం కృష్ణమూర్తిని ఎంతగానో కలచివేసింది. అతనికి తెలియకుండానే కళ్లల్లోంచి నీళ్లు తన్నుకువచ్చాయి.
రాకీ- కృష్ణమూర్తి దంపతులు ఇష్టంగా పెంచుకునే పెంపుడు కుక్క. కృష్ణమూర్తి రాకీకి అవసరమైన ఆహారమంతా తనే చూసుకుంటాడు. దానికి వారంవారం స్నానం చేయిస్తాడు. అలాగే అనారోగ్యం చేస్తే వెటర్నరీ ఆసుపత్రికీ తీసుకెళ్తుంటాడు. అవసరమైన ఇంజెక్షన్స్‌ వేయిస్తుంటాడు. రాకీ రోజూ అతనింటి అరుగుమీదే రాత్రిళ్లు నిద్రపోతుంది.
కృష్ణమూర్తికి ఇనుప గొలుసుతో బంధించి, ఆ మూగజీవుల స్వేచ్ఛను హరించడం ఎంత మాత్రం నచ్చదు. రాకీని ఎప్పుడూ అలా బంధించి ఎరుగడు. రాకీ అప్పుడప్పుడు బయటకెళ్తూ, మిగతా అన్ని వేళల్లోనూ కృష్ణమూర్తి ఇంటినే అంటిపెట్టుకుని వుంటుంది.
రాకీని ఆలా చూడ్డంతో కృష్ణమూర్తి వణుకుతున్న చేతులతో అమాంతం ఎత్తుకుని, ఇంటిలోనికి తీసుకువెళ్లాడు. అప్పటికప్పుడు గబగబా దెబ్బలకు మందుపూసి, బ్యాండేజీలు చుట్టి తాత్కాలికంగా 'ఫస్ట్‌ ఎయిడ్‌' చేశాడు.
ఎవరో బలమైన కర్రతో ఆ అమాయిక ప్రాణిని విచక్షణారహితంగా చితకబాదారని అతనికి అర్థమైంది. అతని హృదయాన్ని ఎవరో గట్టిగా మెలిపెట్టి, నులిమేసినట్టుగా ఎంతగానో విలవిల్లాడిపోయాడు.
అ మరుసటి ఉదయాన్నే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లి, పూర్తిస్థాయి వైద్యాన్ని చేయించాడు. ఇంటికి వచ్చాక తన ఇంటి చుట్టుపక్కల వారిని రాకీని ఎవరు అంత అమానుషంగా కొట్టారని వాకబు చేయగా పక్కింటి వెంకట్రావు చేసిన దాష్టీకమని తెలిసింది.
కృష్ణమూర్తి, ఆ విషయాన్ని గూర్చి వెంకట్రావుని నిలదీయడానికి వెనక్కితగ్గాడు. కాస్త ఆలోచనలోపడ్డాడు. పక్కింటి వెంకట్రావు కనీస మానవత్వపు విలువలు తెలియని విపరీతపు మనిషి. మంచీ, మానవత్వం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు.
కృష్ణమూర్తి-అందరూ బాగుండాలని కోరుకునేవాళ్లలో ముందు వరుసలో ఉంటే.. వెంకట్రావు-అందరూ నాశనమై పోవాలి. తనూ, తన కుటుంబం మాత్రమే బాగుండాలనుకునే వారి సరసన నిలబడే కరుడుకట్టిన స్వార్థపూరిత కుసంస్కార కసాయి మనిషి!
పక్కింటి వెంకట్రావుకి మొదట్నుంచీ రాకీ మీద విపరీతమైన ద్వేషం, కోపం. ఎందుకంటే రాత్రులు ఎవరైనా అనుమానంగా సంచరిస్తే.. రాకీ పెద్దగా మొరుగుతుంది. అ అరుపులు తమకు నిద్రా భంగం కలిగిస్తున్నాయని నాలుగైదు దఫాలు గొడవ కూడా పడ్డాడు. కృష్ణమూర్తి తన మంచితనంతో నెమ్మదిగా నెట్టుకు వస్తున్నాడు. రాకీ విషయంలో జరిగిన దారుణానికి కృష్ణమూర్తికి కోపంతో రక్తం మరిగిపోయినాగానీ వెంకట్రావునీ ఏమీ అనలేక మిన్నకుండిపోయాడు.
 

                                                                                      ***

కాలచక్రంలో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి. ఒకరోజు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో రాకీ పెద్దగా అరుస్తోంది. తన అరుపులోని సాంద్రత బట్టి అది ఎందుకు అరుస్తోందో కృష్ణమూర్తి బాగా గ్రహించగలడు. రాకీ, గాఢంగా నిద్రపోతున్న తనని లేపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని అర్థమైన కృష్ణమూర్తి ఒక్క ఉదుటున లేచాడు. హుటాహుటినా బయటకెళ్లాడు. రాకీ కృష్ణమూర్తిని చూడగానే పక్కింటి వైపు పరుగుతీసింది.
అక్కడ ఇంటిబైట వెంకట్రావూ, మరికొంతమంది నిల్చుని వున్నారు. వాళ్లందరీ మొహాల్లోనూ ఆందోళన అక్కడే వున్న వీధి దీపపుకాంతిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇరుగూపొరుగూ ఆడవాళ్ళందరూ అక్కడే వున్నారు.
కృష్ణమూర్తి గబగబా వెళ్లి 'ఏమయ్యింది?' అంటూ అక్కడున్నవారిని అడిగాడు. 'పురిటికోసం వచ్చిన వెంకట్రావు కూతురికి నొప్పులొస్తున్నాయి.' అంటూ చెప్పింది కృష్ణమూర్తికి తెలిసిన ఒకామె.
విషయం కొంత అర్థమైన కృష్ణమూర్తి, ఇంకా ఏదో అడుగుదామనుకున్నంతలో ఆమె మళ్లీ చెప్పింది. 'తల్లీబిడ్డా చాలా ప్రమాదంలో వున్నారు. పురుళ్ళుపోసే సుభద్రమ్మ ఊళ్ళో లేదు. అంబులెన్సుకి ఫోన్‌ చేశారు. అదొస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆది ఎప్పుడొస్తోందో? ఎంత టైము పడుతుందో.. ఏంటో?!' అంది ఆవిడ భయం భయంగా కంగారుపడుతూ.
పరిస్థితిని అర్థం చేసుకున్న కృష్ణమూర్తి పరుగులాంటి నడకతో తన ఇంటికి వచ్చాడు. వేరే ఊర్లో ఉంటూ తనని చూడ్డానికి ఆ సాయంత్రమే ఊరు నుంచి వచ్చిన తన తల్లిని గాబర గాబరాగా నిద్రలేపి, ఆమెని ఆదుర్దాగా తనతోపాటే వెంకట్రావు ఇంటికి తీసుకెళ్లాడు.
పార్వతమ్మని చూడ్డంతోనే అక్కడున్న కొంతమంది పోతూన్న ప్రాణం తిరిగొచ్చినట్టుగా ఊపిరి పీల్చున్నారు. కృష్ణమూర్తి తల్లి పార్వతమ్మ పురుళ్ళు పోయడంలో మహాదిట్ట.. అని అక్కడున్న కొద్దిమందికి మాత్రమే తెలుసు. పరిస్థితిని అర్థంచేసుకున్న పార్వతమ్మ వడివడిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది.
బయట నుంచి చూస్తున్న కృష్ణమూర్తికి అమ్మచేతి మహాత్మ్యం గురించి బాగా తెలుసు. అందుకే 'తల్లీపిల్లా... ఇద్దరూ క్షేమమే! ఎవరూ కంగారుపడొద్దు' అంటూ అక్కడున్న వెంకట్రావుతో సహా అందరికీ ధైర్యాన్నిస్తున్నట్టుగా దృఢంగా అన్నాడు కృష్ణమూర్తి.
అ కాసేపటి తరువాత పార్వతమ్మ బయటకి వచ్చింది. ఆమె ఏమి చెప్తుందోనని అందరూ శ్వాస బిగబట్టుకుని చూశారు. పార్వతమ్మ మొహంలో సన్నగా మెరుపులాంటి చిరునవ్వు వెల్లివిరిసింది. అంతే అక్కడున్న అందరి హృదయాల్లో ఆనందం ఒక్కసారిగా పెల్లుబుకింది. అందరి మనస్సుల్లోనూ తుపాను కల్లోలం మాయమై, ప్రశాంతత చేటుచేసుకుంది.
'తల్లీబిడ్డా క్షేమం...!' అంటూ ఆమె చెప్పిన చల్లనిమాట దడదడమంటూ వంద కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంటున్న వెంకట్రావు గుండెకు ఆయుష్షునే పోసింది. ఎందుకంటే అతను ఎలాంటివాడైనా కూతురంటే అతనికి పంచప్రాణాలు. తన కూతురుకి ఏమైనా జరిగితే, అతని గుండె కచ్చితంగా ఆగిపోతుంది.
సంబ్రమాశ్చర్యాలతో, వ్యక్తీకరించలేని భావోద్వేగాలతో వెంకట్రావు కళ్ళ వెంట నీళ్లు .. ఆనంద భాష్పాలుగా జలజలా జారిపోతున్నాయి. అతనికి ఎదురుగా వున్న కృష్ణమూర్తిని గాఢంగా కౌగిలించుకుంటూ..
'సారీ, కృష్ణమూర్తిగారు, ఆ రోజు మీ రాకీని అన్యాయంగా కొట్టింది నేనే అని తెలిసినా, నా ఇంట్లో మూడు నిండు ప్రాణాల్ని నిలబెట్టారు. మీరు నా పాలిట భగవంతుడే..!' అంటూ తన పశ్చాత్తాపాన్ని వెళ్ళగక్కుతూ బావురుమన్నాడు.
కృష్ణమూర్తికి అతన్ని ఓదార్చడం చాలా కష్టమైంది. వెంకట్రావు పట్టరాని భావోద్వేగంతో ఏడుస్తూనే వున్నాడు. ఆ కన్నీటి వెచ్చదనానికి కరడుకట్టిన అతని హృదయంలోని మాలిన్యమంతా నెమ్మదిగా మంచులా కరిగిపోతోంది.
కృష్ణమూర్తిని ఆరాధనా భావంతో చూశాడు వెంకట్రావు. అతని కంటికి కృష్ణమూర్తి మానవత్వానికి నిజమైన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాడు.
కృష్ణమూర్తి అతనివైపు లాలిత్యంగా చూస్తూ 'చూడండి వెంకట్రావుగారూ మీ ఇంట మూడు ప్రాణాల్ని నిలబెట్టానన్నారే... నిజానికి ప్రాణాల్ని నిలబెట్టింది నేనుగానీ, మా అమ్మగానీ కాదు. ఈ క్రెడిట్‌ అంతా చెందాల్సింది మా రాకీకే!. ఎందుకంటే మీ ఇంట్లో ఇంత కష్టమొచ్చిందని నాకు తెలిసేలా చేసిన రాకీ అరుపులే ఈరోజు మన ఆనందానికి కారణం. మీరు ఒకప్పుడు విసుక్కున్న, దారుణంగా కొట్టిన మా రాకీ అరుపులే. అవే ఈ రోజు మీ కూతురుకీ, ఆ పసిబిడ్డకీ ఆయుష్షుని పోశాయి...' అన్నాడు కృష్ణమూర్తి.. యదార్థాన్ని అతనికి తెలియజేస్తున్నట్టుగా.
వెంకట్రావు తన తప్పిదాన్ని తెలుసుకున్నట్టుగా అక్కడే కాస్త దూరంలో నిల్చుని, చూస్తోన్న రాకీ వద్దకు పరుగున వెళ్లి మోకాళ్లమీద కూర్చుని, 'సారీ, రాకీ...! నీకు నేను హాని తలపెట్టినా, మా నిండు జీవితాల్ని నిలబెట్టావు...!''అంటూ ఏ చేతులతో రాకీని చావబాదాడో ఆ చేతులతోనే రాకీకి దండం పెట్టాడు.. పశ్చాత్తాపం నిండిన నిర్మలమైన మనసుతో.
ఆ మూగజీవి వెంకట్రావు వైపు అమాయకంగానూ, నిర్వికారంగానూ చూసింది. అప్పుడే నూటా ఎనిమిది నెంబరు అంబులెన్సు వచ్చి, కాస్త దూరంగా ఆగింది. వెంకట్రావు నెమ్మదిగా లేచి, అంబులెన్సు వేపు అడుగులు వేశాడు.
అంబులెన్సు డ్రైవరు దగ్గరకు వెళ్లి, చిన్నగా గొంతు పెగుల్చుకున్నాడు. 'మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలి. నా కుటుంబసభ్యులైన రాకీ, కృష్ణమూర్తీ, పార్వతమ్మలూ నా ఇంటి కష్టాన్ని గట్టెక్కించారు. మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి!' వసుధైక భావాన్ని హృదయంమంతా నింపుకుని మాలిన్యరహితమైన మనస్సుతో అన్నాడు వెంకట్రావు. వచ్చిన ఆ అంబులెన్సును వెనక్కు పంపిచేస్తూ.

శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు
99128 48738