Oct 16,2022 08:26

పూర్వం తక్షశిల అనే రాజ్యాన్ని సురేంద్ర వర్మ అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. రాజ్యంలోని సాహిత్యకారులను పిలిచి పోటీలు నిర్వహించాడు. ఆ పోటీల్లో రామస్వామి, సుందరమూర్తి అనే ఇద్దరు అన్ని సాహిత్యాంశాల్లోనూ సమవుజ్జీవులుగా రావడంతో వారిద్దరిలో ఎవరిని విజేతగా ప్రకటించాలో సురేంద్రవర్మకి అర్థం కాలేదు. ఈ సమస్యను మహామంత్రి సదానందాన్ని పరిష్కరించమన్నాడు మహారాజు. 'అలాగే మహారాజా!' అన్నాడు మంత్రి. కొద్ది సమయం ఆలోచించిన సదానందానికి చక్కని ఉపాయం తట్టగా, సభలో అందరి సమక్షంలో వారిద్దరినీ ఉద్దేశించి సదానందం ఇలా అన్నాడు..
'ఓ పండితులారా! మీరిద్దరూ అన్ని సాహిత్య సంబంధ విషయాల్లో సమాన ప్రతిభ కనబరిచినందుకు ముందుగా మీకు మా తక్షశిల రాజ్యం నుండి అభినందనలు. మీరిద్దరూ నేడు విజేతలే అయినా మా మహారాజుగారి సూచన మేరకు మీకో చిన్న పరీక్ష పెడుతున్నాను. మీలో ఎవరైతే ఆ పరీక్షలో నెగ్గుతారో వారే అసలైన విజేత' అన్నాడు సదానందం. ఇద్దరూ సమ్మతమే అన్నట్లుగా తలూపారు.
'విజేతలైన వాళ్ళకి మహారాజు ప్రకటించిన బహుమతి ఐదు లక్షల వరహాలు ఇదే సభలో అందజేయబడుతుంది.' అంటున్న మహామంత్రి వైపు ప్రశంసగా చూశాడు సురేంద్రవర్మ .
'మీ ఇద్దరికీ చెరో లక్ష వరహాలు ఇస్తున్నాము. మీరు మీకు నచ్చిన దిశగా వంద మైళ్ళ దూరం వెళ్ళండి. అక్కడ మీకు తోచినట్లుగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయండి. ఒక మాసం తరువాత ఇదే సభలో మనమంతా కలుద్దాం. మీరు ఈ సొమ్మును ఎలా ఖర్చు చేశారో సభకి తెలియజేయండి. అప్పుడు నేను నా తీర్పును మహారాజుగారి అనుమతితో తెలియజేస్తాను.' అంటూ ఇద్దరికీ చెరో లక్ష వరహాల మూటని అందించాడు సదానందం.
ఒక మాసం తరువాత..
సభలో ఆసీనులై వున్నారు సుందరమూర్తి, రామస్వామి.
సభలో ఉన్న జనులు.. వాళ్ళేం చెబుతారో.. వాళ్ళు ఆ లక్ష వరహాలు ఎలా ఖర్చు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'మహారాజా.. నేను పడమర దిశగా వంద మైళ్ళ దూరం ప్రయాణించాను. అక్కడ చక్కని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని, మధ్యలో ఒక కట్టడాన్ని కట్టాలని తలిచాను. పనులు మొదలుపెట్టాను. అందుకు మీరిచ్చిన మొత్తం సరిపోలేదు. మీరు ఎప్పుడైనా అటుగా వస్తే.. విహారానికి విడిది చేయడానికి అనువుగా వుంటుందని భావించాను' అన్నాడు సుందరమూర్తి.
సభలోని వారంతా చప్పట్లు కొట్టారు.
సంతోషంతో పొంగిపోయాడు సుందరమూర్తి.
రామస్వామి లేచి మహారాజుకి, సభలోని వారందరికీ సవినయంగా నమస్కరించి.. ఇలా చెప్పాడు.
'మహారాజా! నేను తూర్పుదిశగా వంద మైళ్ళ దూరం ప్రయాణించాక ఒక చిన్న పల్లెటూరు ఎదురైంది. అక్కడ రచ్చబండ దగ్గర చెట్టుకింద కొంతమంది యువకులు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, వస్తూ పోతున్న వాళ్ళని ఎగతాళి చేస్తూ.. తమలో తామే హాస్యమాడుకుంటూ.. కాలయాపన చేయడం గమనించాను. యువత ఇలా ఉంటే దేశం అభివద్ధి కుంటుపడడమే కాదు. అది ఎన్నో అనర్థాలకి దారితీస్తుందని అనుకున్నాను. అందుకే వాళ్ళందరికీ జీవితం విలువ తెలిసేలా నాకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పి.. ఒక అద్దె ఇంట్లో చిన్న కుటీర పరిశ్రమ ప్రారంభించాను. ఫలితాలు ఉత్తమంగా వచ్చాయి. వాళ్ళలో వచ్చిన మార్పు తప్పకుండా ఈ సమాజానికి మంచే చేస్తుంది. మీరిచ్చిన లక్ష వరహాలు పెట్టుబడిగా పెట్టి ప్రారంభించిన పరిశ్రమలో, పెట్టుబడి తిరిగి రావడమే కాక, మరో పదివేల వరహాలు లాభం వచ్చాయి' అంటూ సొమ్మును తిరిగి అందిస్తున్న రామస్వామిని అందరూ మెచ్చుకుంటూ హర్షధ్వానాలతో అభినందించారు.
విజేతగా ప్రకటించబడిన రామస్వామితో.. 'సాహిత్యం అంటే ఒక మేధస్సు మాత్రమే అనుకునే అజ్ఞానంలో వున్న నాకు కనువిప్పు కలిగించారు. మనం చెప్పే మాటలు.. లోక హితానికి అవసరమవ్వాలని తెలుసుకున్నాను. కేవలం మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో చూపిన మీ ప్రతిభకు శిరస్సు వంచి, ప్రణామం చేస్తున్నాను' అంటూ సుందరమూర్తి రామస్వామిని ఆలింగనం చేసుకున్నాడు. సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపిన మంత్రి సదానందం వైపు ప్రశంసగా చూశాడు సురేంద్రవర్మ .

గొర్రెపాటి శ్రీను
[email protected]