ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ప్రతిచోట అరుణ కాంతులు విరజిమ్ముతూ జెండాలు రెపరెపలాడుతుంటాయి. అదే సమయంలో అలాగే కాసే, పూసే ఫల పుష్ప మొక్కలెన్నో ఉన్నాయి. మేడే సందర్భంగా వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం!
- మే ఫ్లవర్
ఇది దుంప జాతి మొక్క. లిల్లీ కుటుంబానికి చెందింది. ఫుట్‌బాల్ ఇల్లి అని కూడా పిలుస్తారు. మే నెల ఆరంభంలోనే ఎర్రటి, గుండ్రని పూలు పూస్తాయి. ఒక నెల ముందు భూమిలో నాటిన దుంప నుంచి సన్నగా దూటలాంటి మొక్క వస్తుంది. ఆకులు వెడల్పుగా, పొడవుగా ఉంటాయి. మే ఆరంభంలో మండుతున్న ప్రచండ భానుడిలా ఒక్కసారిగా పువ్వు విచ్చుకుంటుంది. మూడు నాలుగు రోజులకి పువ్వు వాడిపోతుంది. ఒక్కో మొక్కకు ఒక్కటే పూవు పూస్తుంది. అలా మే నెలలో పువ్వు పూసి కొన్నాళ్ళకి మొక్క వాడిపోతుంది. ఇది మే నెలలోనే పూయడంతో దీన్ని 'మే ఫ్లవర్' అని పిలుస్తారు.
- జంబో ఫలా రెడ్
గులాబీ, జామ, వాటర్ ఆపిల్స్, జంబోఫలా పేర్లతో పిలిచే ఈ మొక్క ఎక్కువగా మే నెలలోనే కాయలు కాస్తుంది. తీయగా, చప్పగా ఉండే ఈ కాయల్లో విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు దాహార్తిని అరికడతాయి. ఇందులో జంబోఫలా రెడ్ రకం ఓ అద్భుతం. ఎర్రగా నిగనిగలాడుతూ ఎంతో ఆకర్షణగా ఉంటాయి. వేసవి అంతా కాయలు కాస్తూనే ఉంటాయి. ఒక్కో మొక్క వేల సంఖ్యలో కాయలు కాస్తుంది. దీనిని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.
- ఫైర్ లిల్లీ
మండుతున్న అగ్నిశిఖలా కనిపించేది ఫైర్ లిల్లీ. ముఖ్యంగా ఔషధ విలువలు కలిగిన మొక్క. అడవిలో ఎక్కువగా పెరుగుతుంది. ఐదారు అడుగుల ఎత్తు వరకు పెరిగి, ఆ తర్వాత సన్నని తీగల్లా ఎగబాకుతుంది. మండు వేసవిలో అంటే మే నెలలో దీపశిఖలాంటి పువ్వులు పూస్తుంది. ఇవి చూడ్డానికి అచ్చంగా మండుతున్న అగ్ని మంటల్లా కనిపిస్తాయి. దీని శాస్త్రీయ నామం గ్లోరియోసా సూపర్బా. కొల్చికేసి కుటుంబానికి చెందిన మొక్క. ఫ్లేమ్ లిల్లీ, క్లైంబింగ్ లిల్లీ, క్రీపింగ్ లిల్లీ, గ్లోరీ లిల్లీ, గ్లోరియోసా లిల్లీ, టైగర్ క్లా, అగ్నిశిఖ, ఫైర్ లిల్లీ, అడవి నాభి వంటి ఎన్నో పేర్లు ఈ మొక్కకు ఉన్నాయి. పువ్వుల అందమే అందం. పువ్వులు వాడి పోయాక మిగిలిన కాయల్లో విత్తులుంటాయి. పది రోజులకు ఒకసారి నీటివనరు అందిస్తే సరిపోతుంది. ఎర్రమట్టి నేలల్లో బాగా పెరుగుతాయి.
- హుజేనియా రెడ్
హుజేనియా జాతిలో అద్భుతమైన ఒక రకం హుజేనియా రెడ్. గోరింటాకులా చిన్న ఆకుపచ్చని ఆకులు ఉంటాయి. నెమ్మదిగా చిగురులోంచి వచ్చే పై ఆకులు ఎర్రగా మారుతుంటాయి. మే నెల వచ్చేసరికి పై ఆకులన్నీ ఎర్రగా మారి, తళ తళా మెరుస్తూ మురిపిస్తాయి. కుండీల్లో కూడా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. కావలసిన ఆకారాల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముంగిట. పార్కులు, రహదారుల మధ్యలో ఈ మొక్కలు ఆకర్షణగా ఉంటాయి.
- కన్నాస్ రెడ్ ఫ్లవర్
సన్నగా, పొడవుగా ఎర్రని మొక్క ఇది. ముఖమల్ క్లాత్‌లా పువ్వులు మెత్తగా ఉంటాయి. రెండు మూడు అడుగుల ఎత్తువరకు పెరిగిన మొక్క మొవ్వులోంచి పువ్వులు పుట్టుకొస్తాయి. దీన్ని మనం మెట్ట తామర అని పిలుస్తాం. దుంప నుంచి మొక్కలు పుట్టుకొస్తాయి. ఇందులో రకాలు ఉన్నప్పటికీ ఎర్ర పువ్వులు పూసే మొక్కలే హైలెట్. ఇవి వేసవిలో విరబూసి, ఎర్రజెండాలు ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి. ఇంటి ముంగిట ఫెన్సింగ్ గాను, బోర్డర్ ప్లాంట్స్ గాను, కుండీల్లో టేబుల్ మొక్కలు గాను వీటిని పెంచుకోవచ్చు.
చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506