Nov 14,2023 07:15

       మినీరత్న కేటగిరిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సిడబ్ల్యుసి) ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం దూకుడు మీదుంది. కేంద్రంలో రెండవ తడవ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థల (పిఎస్‌యు) మోనిటైజేషన్‌ (నగదీకరణ) ప్రణాళికను సర్కారు వెల్లడించగా, అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో కొంత స్తబ్ధుగా కనిపించినా చాపకింద నీరులా మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లోని ప్లాన్లను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతోంది. అందులో భాగమే సిడబ్ల్యుసి గిడ్డంగుల ప్రైవేటీకరణ. తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాలతో సహా దేశ వ్యాప్తంగా 54 చోట్ల సిడబ్ల్యుసి గోదాముల ప్రైవేటీకరణ నిమిత్తం రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ 'నైట్‌ఫ్రాంక్‌'తో సిబ్ల్యుసి ఒప్పందం కుదుర్చుకుంది. సిడబ్ల్యుసి భూముల్లో అధునాతన వసతులతో నైట్‌ఫ్రాంక్‌ గోడౌన్లు నిర్మిస్తుంది. వాటిని 45 సంవత్సరాల లీజు ప్రాతిపదికన హస్తగతం చేసుకొని వ్యాపారం చేసుకుంటుంది. అద్దెల ద్వారా లభించిన నికర ఆదాయంలో ఐదు శాతం వాటా మాత్రమే సిడబ్ల్యుసికి వస్తుంది. తతిమ్మా 95 శాతమూ నైట్‌ఫ్రాంక్‌ కైవసం చేసుకుంటుంది. దీనికి బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ అని ముద్దు పేరు పెట్టారు. విలువైన భూములేమో సిడబ్ల్యుసివి, ఆదాయమేమో ప్రైవేటు సంస్థది. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో !
           వినియోగదారులు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ పరిధిలోనిది సిడబ్ల్యుసి. ప్రత్యేక చట్టం ద్వారా 1962లో నెలకొల్పిన సిడబ్ల్యుసికి దేశ వ్యాప్తంగా 104 లక్షల సామర్ధ్యం కలిగిన 458 గిడ్డంగులున్నాయి. అవి కాకుండా 19 రాష్ట్రాల వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్ల కింద 50 శాతం షేర్‌పై 439 లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన గోడౌన్లున్నాయి. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల సరుకుల నిల్వలకు అనుమతించాలి. అనంతరమే ప్రైవేటు సంస్థలకు అద్దెలకివ్వాలి. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలను ఎప్పుడైతే అమలు చేయనారంభించాయో ఈ ప్రాథమ్యాల్లో మార్పులు రాసాగాయి. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆహార ధాన్యాల నిల్వలకు ఖాళీ లేదంటూ ప్రైవేటు సంస్థల వస్తువులు నిల్వ చేసే వరకు వచ్చింది. మోడీ సర్కారు మరో అడుగు ముందుకేసి మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో సిడబ్ల్యుసిని చేర్చింది. అందులో భాగంగా గోదాముల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం దూసుకెళుతోందని తాజాగా నైట్‌ఫ్రాంక్‌తో కుదుర్చుకున్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ఒప్పందం ద్వారా రూఢ అవుతోంది.
          ప్రభుత్వరంగ సంస్థలకు దేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత విలువైన భూములపై కార్పొరేట్ల కన్ను పడింది. ఆ భూములను మోడీ సర్కారు తమకు అనుకూలమైన సంస్థలకు ధారాదత్తం చేసే ప్రణాళికే మోనిటైజేషన్‌ అని వేరే చెప్పనవసరం లేదు. సిడబ్ల్యుసికి వివిధ రాష్ట్రాల్లో 572 ఎకరాల ఖాళీ భూములున్నాయి. వాటిలో 344 ఎకరాలను అమ్ముకొని నిధులు సమీకరించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టులో నైట్‌ఫ్రాంక్‌ సంస్థ రూ.రెండు వేల కోట్లకుపైన పెట్టుబడులు పెడుతుందంటున్నారు. గతంలో గోదాముల నిర్వహణ బాధ్యత సిడబ్ల్యుసి, ఎస్‌డబ్ల్యుసిలకు ఉండేది. ఇప్పుడు భూములను, భవనాలను, వాటిలో అద్దెల నిర్ణయం, అన్నింటిపైనా ప్రైవేటు సంస్థలకు ఆధిపత్యం, అధికారం వస్తుంది. కేవలం నామమాత్రంగా లీజులు తీసుకునే పనే సిడబ్ల్యుసిది. మోడీ సర్కారు వచ్చాక ఆహార ధాన్యాల సేకరణ తగ్గిపోతోంది. పిడిఎస్‌ కోతలకు గురవుతోంది. దీని వలన అటు రైతులకు కనీస మద్దతు ధరలు పడట్లేదు, ఇటు వినియోగదారులకు రేట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ గోదాములు కాస్తా కార్పొరేట్ల గుప్పెట్లోకి పోతే భవిష్యత్తులో ఆహార భద్రత ప్రశ్నార్ధకమవుతుంది. మన రాష్ట్రంలో రాయనపాడు, పెదకాకాని, నెల్లూరు, అనకాపల్లిలో గోదాములను నైట్‌ఫ్రాంక్‌కు ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం కనీసమాత్రం స్పందించట్లేదు. పైగా కేంద్రం చెప్పినట్లు గోదాముల ఆన్‌లైన్‌ నిర్వహణ కోసం డిజిటలైజేషన్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం డిజైన్‌ చేసిన మోనిటైజేషన్‌ ప్రోగ్రాంను, గోదాముల అమ్మకాలను ప్రజలందరూ వ్యతిరేకించాలి.