Nov 12,2023 12:59

'తాతయ్యా! రఘూ మామయ్య ఇవ్వాళ మా అందరినీ లంచ్‌కి బయటకు తీసుకెళ్తాను అన్నారు.. మీరు కూడా మాతో రావాలి' పిల్లలందరూ విశ్వనాథóం చుట్టూ చేరి అన్నారు.
'అలాగే వస్తానర్రా. రోజూ ఇంట్లో తింటాము. అప్పుడప్పుడూ అందరూ కలిసి ఇలా బయటకు వెళ్ళి తినడంలో ఆ సరదా, సంతోషం వేరు. సరే మనం లంచ్‌కి వెళ్ళడానికి కాస్త సమయం ఉన్నది కదా! ఈలోగా మీకో చిన్న కథ చెప్తాను వినండి.
'మా ఊరు మంగాపురంలో కొన్ని కుటుంబాల వాళ్ళు కలిసి వన భోజనాలకి వెళ్ళాలని అనుకున్నారు. ముందు రోజే మంగయ్యగారి మామిడి తోటను చూసి వచ్చారు. మర్నాడు ఉదయాన్నే అందరూ బయల్దేరి వెళ్లారు. అక్కడ వంట ఏర్పాట్లు ఉన్నా, వెళ్ళగానే తినడానికి కొన్ని ఫలహారాలు వెంట తీసుకువెళ్ళారు. పిల్లలైతే బిస్కెట్‌ ప్యాకెట్లు, కురుకురెలు, చిప్స్‌ ప్యాకెట్లు, చాక్లెట్లు కవర్లల్లో వేసుకుని వెంట తీసుకెళ్ళారు.
ఆ పచ్చని చెట్ల కింద పిల్లలు కేరింతలు కొడ్తూ స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరారు. పెద్దలు వెంట తెచ్చుకున్న చాపలు పరుచుకుని, ఎక్కడెక్కడి కబుర్లో కలబోసుకున్నారు. కొందరు ఆడవాళ్ళూ మొగవాళ్ళూ కూర్చుని బోలెడన్ని కూరగాయలు తరిగారు. పెద్దపెద్ద రాళ్ళు తెచ్చి పొయ్యిలు పేర్చారు. ఎండుకట్టెలు తెచ్చి, వంట మొదలుపెట్టారు. మొదట అందరికీ ఉప్మా వండి పెట్టారు. పెద్ద వాళ్ళు టీలు తాగారు.. ఇక 2, 3 గంటలు శ్రమించి, రకరకాల వంటలు చేశారు.
ఒక పక్కన వంటలు వండుతుండగా మరో పక్క పిల్లలూ, పెద్దలూ చేరి సౌండ్‌ సిస్టంలో రకరకాల పాటలు పెట్టుకుని సందడి సందడిగా డాన్సులు చేశారు. కొందరు పిల్లలు చెట్ల కింద చేరి కోతికొమ్మచ్చి ఆటలు ఆడితే.. మరికొందరు కోకో ఆడారు. అందరూ వెంట తెచ్చుకున్న ఫోన్‌లతో బోలెడన్ని ఫోటోలు దిగారు. మధ్యాహ్నం వరకు పిల్లలు, పెద్దలు రకరకాల ఆటలు ఆడుకొన్నారు. తరువాత అందరూ చేరి వలయాకారంలో కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ చక్కని విందార గించారు. భోజనానంతరం అందరూ ఒకే దగ్గర సమావేశం అయ్యారు. రెండుగంటల పాటు రకరకాల ఆటలు ఆడుకున్నారు. పాటలు పెట్టుకొని, గుంపులు గుంపులుగా చక్కటి డాన్సులు చేశారు. ఆ మామిడి తోట పిల్లల, పెద్దల ఆట పాటలతో మారు మోగి పోయింది. ఆ వనభోజన వేడుక ఆనందంగా సాగింది.
తామంతా సంతోషంగా ప్రకృతిలో గడపడం ఎంత బాగుందో' అనుకున్నారు పిల్లలూ పెద్దలూ. సమయం ఐదు గంటలవుతుండగా మెల్లగా ఇళ్ళకు బయలుదేరారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అప్పటిదాకా ఆ తోటలో కేవలం ఎండుటాకులు మాత్రమే రాలి ఉండేవి. ఇప్పుడక్కడ ఒక చోట వంట చేసినచోట కూరగాయల తొక్కలు .. టీలు తాగి పారేసిన యూజ్‌ అండ్‌ త్రో కప్పులూ కుప్పగా పోసిన బోలెడన్ని ప్లాస్టిక్‌ విస్తరాకులు, అక్కడా ఇక్కడా తాగి పారేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, వదిలిపెట్టి వెళ్ళిన నీళ్ళ సీసాలు, పిల్లలు చెట్ల మొదళ్లలో పారేసిన బిస్కెట్‌ కాయితాలు, చాక్లెట్‌ పేపర్లు, కురుకురే ప్యాకెట్లు.. అబ్బో ఇప్పుడు అది తోటలాగా కాకుండా ఒక పెద్ద చెత్తకుండీలా తయారైంది. మర్నాడు ఉదయమే వచ్చిన మంగయ్య గారికి ఇది తన తోటేనా అనిపించింది. ఇప్పుడు దీన్ని ఎలా శుభ్రం చేయాలో అర్థం కాలేదు మంగయ్యకు.
ఆయనకి తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. 'అప్పుడు కూడా ఇలాగే వన భోజనాలు ఉండేవి. కానీ అందరూ పెద్దపెద్ద గిన్నెల్లో వండుకున్నా వంటలను చక్కగా విస్తరాకుల్లోనూ, అరిటాకుల్లోనూ తినేవాళ్ళు. పాయసాలు, పరవాన్నాలు ఆకు దొన్నెల్లో తినేవాళ్ళు. చెంబుల్లో, గ్లాసుల్లో నీళ్ళు తాగి ఆ చెంబులను గ్లాసులను ఆ వంట పాత్రలను తిరిగి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎంత మార్పు. ఎటు చూసినా థర్మాకోల్‌ ప్లేట్స్‌, డిస్పోజబుల్‌ గ్లాసులు.. ఎక్కడికక్కడ చెత్త పారేయడమేనా ఈ నాగరికులు నేర్చుకున్నది..' అనుకొని చాలా బాధపడ్డాడు. కాస్సేపటికి ఊరి నుంచి నలుగురు మనుషులు తోటలోకి వచ్చారు.
'మంగయ్యగారు మన్నించండి. మీ తోట అంతా పాడు చేశామని బాధపడకండి. అదంతా ఊడ్చి, శుభ్రం చేయటానికే మేము వచ్చాము' అని చెప్పారు.
మంగయ్య 'అయ్యా నా తోట సంగతి సరే. అసలు మొత్తం జనమే మారిపోయారు. ఇలా స్వచ్ఛమైన వాతావరణంలో గడపడానికి వచ్చినవాళ్ళు పచ్చని ఆకులలో భోజనం, మట్టి కుండలలో నీళ్ళు, మట్టి పాత్రలలో నీళ్ళు తాగడం గురించి ఆలోచించండి' అని అన్నాడు.
'అవును మనం ఎంతో మారాలి' అనుకున్నారు వాళ్ళు.
'ఇదర్రా కథ!' అని ముగించారు విశ్వనాథం గారు.
'చాలా మంచి కథ చెప్పారు తాతయ్య.. ఇప్పుడు అందరం ఆలోచించాల్సిన గొప్ప సమస్య ఇదే' అంది రూప.
'మనం ఎక్కడికి వెళ్ళినా పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదే. యూజ్‌ అండ్‌ త్రో వస్తువులలో ప్లాస్టిక్‌ వస్తువుల బదులు ప్రకతిలో లభించే వస్తువులను వాటిని ఉపయోగించాక మట్టిలో కలిసిపోయే వస్తువులను మాత్రమే వాడాలి' రఘువీర్‌ అన్నాడు.

ఙ సమ్మెట ఉమాదేవి
9849406722