Nov 12,2023 12:46

చిన్నగూడూరు అనే పల్లెటూరులో పేద దంపతులు నివసించేవారు. వారికి ఇద్దరు పిల్లలు సంధ్య, సాగర్‌. అమ్మాయికే ఎప్పుడూ పని చెప్పేవారు. ప్రతి చిన్న తప్పుకూ సంధ్యనే బాగా తిట్టేవారు. అబ్బాయిని బాగా గారాబం చేసేవారు. సంధ్య పొద్దున్నే లేచి, ఇంట్లో పని అంతా చేసి, చక్కగా తయారై పాఠశాలకు వెళ్ళేది. సాగర్‌ మాత్రం సోమరిగా ఉంటూ సమయానికి పాఠశాలకు వెళ్లేవాడు కాదు. టీచర్లు అతన్ని కొట్టేవారు. చదువు కూడా సరిగా చదవకపోయేవాడు. బాగా అల్లరి చేసేవాడు. పాఠశాలలో ఒకరోజు ఉపాధ్యాయులు పరీక్ష ఫీజు కోసం డబ్బులు తీసుకురమ్మని చెప్తారు. సాగర్‌కు తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు.. కానీ సంధ్యకు ఇవ్వరు. 'నీకు చదువెందుకు? మాతో పాటు పనికిరా కూలి డబ్బులు వస్తాయి!' అని బాధపడేటట్లు మాట్లాడతారు.
        పాపం సంధ్య ఏడుస్తూ వాళ్ళ స్నేహితులకు ఈ విషయం చెబుతుంది. వారు సంధ్య పరిస్థితిని గురించి ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. ఉపాధ్యాయులు సంధ్య మంచితనం, ప్రతిభను చూసి, తను బాగా కష్టపడుతుందని తెలుసుకొని, ఆమె పరీక్షఫీజు డబ్బులు ఉపాధ్యాయులే చెల్లిస్తారు. సంధ్య బాగా కష్టపడి సెలవు రోజులలో పనులకు వెళ్లి, ఉపాధ్యాయులు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లిస్తుండేది. సంధ్య యొక్క ఆత్మాభిమానానికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు. కొన్ని రోజులకు పరీక్ష ఫలితాలు వస్తాయి. సంధ్య ఆ పాఠశాలలో ప్రథమశ్రేణిలో పాసవుతుంది. సాగర్‌ అన్ని సబ్జెక్టులలో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. సంధ్య తల్లిదండ్రులు సాగార్‌ను బాగా దండిస్తారు. అప్పుడు సంధ్య అడ్డం వెళ్లి, 'మీరు గారాబం చేయడం వల్లనే తమ్ముడు ఇలా తయారయ్యాడు. వాడిని కొట్టకండి!' అని ఆపుతుంది. సంధ్య పెద్ద మనసుకు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఆ రోజు నుండి తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగా చూస్తూ, బాగా చదివిస్తారు.

charishma

కె. చరిష్మా,
10వ.తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.