ప్రజాశక్తి - జగ్గయ్యపేట: పట్టణ మున్సిపాలిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను, పట్టణ ప్రజల సహకారంతో అభివద్ధి పథంలో ప్రయాణిస్తుందని పట్టణ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపాలిటీ పాలకవర్గం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 111 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఈ మున్సిపాలిటీలలో కెల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.27.27 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.4.15 కోట్లతో 18. 20 కిలోమీటర్లు డ్రైనేజీ నిర్మాణం, రూ.6.62 కోట్లతో 10.52 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం, పట్టణ ప్రజలకు రోజుకి 5 మిలియన్ లీటర్ల కష్ణ వాటర్‌ను అందజేయడం జరుగుతుందన్నారు. 96 లక్షల రూపాయలతో 14.22 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం 16.6 లక్షల రూపాయలతో 22 చేతిపంపులు వేయడం జరిగిందన్నారు అంతే కాకుండా జగ్గయ్యపేట బస్టాండ్ సమీపంలోని పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలోని బంగారు పేటలో 53 లక్షల రూపాయలతో రెండు మేజర్ బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు.రూ.1.90 కోట్లతో 2 వైయస్ఆర్ హెల్త్ అర్బన్ సెంటర్లను నిర్మించామన్నారు. రూ.60 లక్షలతో టౌన్‌హాల్ నిర్మాణం చేపట్టామన్నారు. పట్టణ పరిధిలో గల మున్సిపాలిటీ స్థలాలకు బోర్డ్ లను ఏర్పాటు చేశామన్నారు. రూ.3.5 కోట్లతో పట్టణంలోని ఊర చెరువును అభివద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలర్ సామినేని వెంకటకష్ణ ప్రసాద్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, డి ఈ శివ కోటేశ్వరరావు పాల్గొన్నారు.