Nov 19,2023 20:54

ఎగ్గుని-సంజామల గ్రామాల మధ్యన రోడ్ల దుస్థితిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

అధ్వాన స్థితిలో రహదారులు
- పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే
ప్రజాశక్తి - సంజామల

   రహదారులు గుంతలు పడి అధ్వాన స్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. జనసేన, టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం మండలంలో గుంతలమయంగా మారిన ఎగ్గోని-సంజామల-ముదిగేడు గ్రామాల రహదారులను పరిశీలించి గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగ్గోని-సంజామల - ముదిగేడు రహదారి, ఆర్‌అండ్‌బి రోడ్డు గుంతలు పడి సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారిందనిఅన్నారు. గుంతలు పడిన రహదారులను సంబంధిత అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రహదారుల మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంజామల టిడిపి నాయకులు విష్ణు వర్ధన్‌ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రవరం : గుంతలమయమైన రోడ్లపై ప్రజలకు ప్రయాణం నరకంగా మారిందని జనసేన పార్టీ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రుద్రవరం మండలంలోని మందలూరు గ్రామంలో జనసేన, టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రవరం మండలం మందలూరు నుండి గాజులపల్లె వెళ్లే రోడ్డు గుంతలు పడడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గుంతలమయమైన ఈ రోడ్డును బాగు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇరిగెలా సూర్యనారాయణ రెడ్డి, ఇరిగెల విశ్వనాథ రెడ్డి, ఇరిగెల ప్రతాప్‌ రెడ్డి, జున్ను ప్రసాద్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య, బావికాడి గురప్ప, మహబూబ్‌ హుస్సేన్‌, తూపల్లె షేక్‌ మహబూబ్‌ బాషా, పెసరవెరు చాంద్‌ భాషా, రామకృష్ణ, మందలూరు రామశేఖర్‌ రెడ్డి, మిద్దె రామ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.