ప్రజాశక్తి - యంత్రాంగం అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాల వద్ద శనివారం ధర్నాలు, సామూహిక రిలే నిరాహారదీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిం చాలని, లేనిపక్షంలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి సమ్మెలోకి వెళ్లక తప్పదని హెచ్చరించారు. రాజమహేంద్రవరం నగరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ పాల్గొని అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా అంగన్‌వాడీల వేతనం చెల్లిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, 2017 నుంచి బకాయి పెట్టిన టిఏ బిల్లులు చెల్లించాలని, మినీ వర్కలను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 8వ తేదీ నుంచి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం.వెంకట లక్ష్మి, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రోజక్టు అధ్యక్ష, కార్యదర్శులు శారద, సునీత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్‌వాడీ సెంటర్లను మెర్జ్ చేశారని, నూతన విద్యా విధానం పేరుతో ఉన్న సెంటర్లను సైతం పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు పౌష్టికాహారం దూరమవుతుందని విమర్శించారు. బాలింతల ఇంటికి వెళ్లి ఫేస్ రికగ్నైజింగ్ చేసే యాపుల పని అంగన్‌వాడీలకు భారంగా మారిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు నాయకులు రామలక్ష్మి, మరియమ్మ, శేషా రత్నం, స్రవంతి, నగరాని, హేమలత, తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్ స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు, ఆయాలు సామూహిక రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాణిక్యంబ, జిల్లా కార్యదర్శి వై.బేబీరాణి డిమాండ్ చేశారు. దేశంలో పిల్లలకు పౌష్టికాహారం, ఫ్రీస్కూల్ విద్య, గర్భిణీ స్త్రీల రక్తహీనత, బాలింతల ఆరోగ్యానికి ఐసిడిఎస్ పథకం అద్భుతమైన మేలు చేస్తుందని అన్నారు. ఐసిడిఎస్ ఏర్పడిన తర్వాత మాతృ మరణాలు, శిశుమరణాలు తగ్గించడంలో విశేష కృషి అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ ద్వారా జరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే డిసెంబర్ 8 నుంచి సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.బ్రమ్మమ్మ, వి.శ్రీదేవి, శాంతకుమారి, పుష్ప, సుశీల, బావవాణి, బాస్కరం, సుజాత, దమయంతి, మహాలక్ష్మి, విజయకుమారి తదితరులు నాయకత్వం వహించారు. పెరవలి స్థానిక పెరవలి ఐసిడిసి ప్రాజెక్టు కార్యాలయం వద్ద ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు కె.సూర్యకాంతం యూని యన్ గౌరవాధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు వేతనంతో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. జె.రత్నకుమారి, ఎం.కన్యాకుమారి, సిహెచ్.విశాలి, ఎం.జానకి, ఎస్.రంగనాయకమ్మ, యు.ధనలక్ష్మి, ఎన్.వెంకాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నాను నిర్వహించారు. ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షురాలు టిపి.లక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి బేబి రాణి పాల్గొని మాట్లాడారు. బడ్జెట్లో ఐసిడిఎస్‌కు నిధులు కేటాయింపు తగ్గించడం వలన పోషకాహారం అందించే విషయంలో మన దేశం వెనుకబడుతుందని, అత్యంత వెనుకబడిన దేశాల కంటే దిగజారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వేదాల శ్రీనివాస్, ప్రాజెక్ట్ నాయకులు ఎన్.రామలక్ష్మి, టిపి.నాగలక్ష్మి, టి.రమాదేవి, పి. రాజేశ్వరి, కె.స్వర్ణలత, శివకుమారి, విమల, పద్మ రాజేశ్వరి, గంగాభవాని, వరలక్ష్మి, కుమారి పాల్గొన్నారు.