Nov 18,2023 20:43

మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్‌
- జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

      అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వైసిపి ప్రభుత్వానికి పతనం తప్పదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రారంభించారు. ఈ దీక్షలను ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు 'నేను ఉన్నాను-నేను విన్నాను, మీ కుటుంబంలోని పెద్దకొడుకులా, ఒక అన్నగా ఉంటానని, మీ జీవితంలో వెలుగులు నింపుతా' అని చెప్పిన మాటలు మరిచి నాలుగున్నర సంవత్సరాల పూర్తయినా నేటి వరకు ఒక్క హామీని అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. రిలే నిరాహార దీక్షల అనంతరం వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా మహిళలంతా కలిసి జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా బటన్‌ నొక్కి ఇంటికి సాగనంపుతారని హెచ్చరించారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచి ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు. వేతనంలో సగం పెన్షన్‌ ఇవాలని, ఫ్రీస్కూల్‌ బలోపేతం చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ పిల్లలకు అమ్మఒడి, యూనిఫారమ్‌ ఇవ్వాలని చెప్పారు. వైయస్‌ ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులు ఇవ్వాలని, లబ్దిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయిల్‌, కందిపప్పు క్వాంటటీ పెంచాలని, సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలిగించాలన్నారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మలమ్మ మాట్లాడుతూ డిసెంబర్‌ 8వ తేదీ కల్లా సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెఎండి గౌసు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు సునీత, నాగరాణి, వసంత, వెంకటరమణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు కె.సరస్వతి, పి.వెంకటలక్ష్మి, ప్రాజెక్టు కార్యదర్శి ఈ.రోజారమణి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జెవి.సుబ్బయ్య, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు రేణుక, రమాదేవి, మల్లేశ్వరి, సుజాత, శ్రీదేవి, భాగ్యలక్ష్మి ,డైనమ్మ పర్వీన్‌, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు
మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు