* జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల సోమవారం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మబ్బులతో ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇచ్ఛాపురం మండలం బొడ్డపడలో 1 మి.మీ, అరకభద్రలో 0.75 మి.మీ వర్షం నమోదైంది. టెక్కలి మండలం రావివలస, జలుమూరు, ఆమదాలవలస, ఎచ్చెర్లలో అర మి.మీ చొప్పున వర్షం కురిసింది. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలం నిమ్మాడ, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో అన్నదాతల్లో గుబులు రేగుతోంది. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నాయి. బూర్జ, సారవకోట, జలుమూరు, నరసన్నపేట మండలాల్లో ఇప్పటికే నాలుగో వంతు కోతలు పూర్తయ్యాయి. కోసిన వరి పనలు పొలాల్లోనే ఉన్నాయి. కొందరు వాటిని కళ్లాలకు చేర్చి వాటిపై గడ్డి, టార్పాలిన్లు కప్పి కాపాడుకునే పనిలో నిమగమయ్యారు. కొన్నిచోట్ల ఆదరాబాదరాగా నూర్పిడి చేసి ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. కోతలు, నూర్పిడి సమయంలో వర్షం కురిస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.