బిగ్ స్క్రీన్ .. బిగ్ ఫైట్..!
- తుమ్మలగుంట గ్రౌండ్లో 40 అడుగుల భారీ స్క్రీన్ - ఉత్కంఠ భరితంగా భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్
- డీజే ఎఫెక్ట్స్‌తో నేరుగా వీక్షించినట్టుగా అనుభూతి - సుమారు 5 వేల మందికి పైగా హాజరైన అభిమానులు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ (బిగ్ ఫైట్)ను క్రికెట్ అభిమానులు బిగ్ స్క్రీన్ మీద వీక్షించారు. తుమ్మలగుంట వద్దనున్న కేవీఎస్ గ్రౌండ్లో 14 అడుగుల ఎత్తు 40 అడుగుల వెడల్పుతో భారీ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వారి సూచనల మేరకు చిత్తూరు జిల్లా బార్సు అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సౌకర్యవంతమైన వసతులు కల్పించారు. బిగ్ స్క్రీన్‌పై బిగ్‌ఫైట్ చూస్తున్న క్రికెట్ అభిమానులకు మ్యాచ్ ప్రారంభం నుంచి త్రాగు నీరు అందిస్తూ సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన సౌకర్యం కూడా కల్పించారు.
ఆద్యంతం ఉత్కంఠ భరితంగా...
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ తొలిసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. భారత్ బ్యాటింగ్ చేపట్టిన మొదటి పది ఓవర్లు రోహిత్ శర్మ బాగానే స్కోర్ చేసినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ సరిలేక పోవడంతో ఫోర్లు, సిక్స్‌లు లేక వీక్షకుల్లో నిశ్శబ్దం ఆవహించింది.
ఆకట్టుకున్న డీజే సౌండ్స్..
బిగ్ స్క్రీన్ మీద బిగ్‌ఫైట్ తిలకిస్తున్న క్రికెట్ క్రీడాభిమానులకు స్పెషల్ ఎఫెక్ట్స్‌గా ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ ఆకట్టుకుంది. డీజే సౌండ్స్, లైటింగ్‌తో క్రీడాభిమానులకు స్క్రీన్ మీద కాకుండా నేరుగా మ్యాచ్ తిలకించామన్న అనుభూతి కలిగింది. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులకు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఎంతో ఆప్యాయతను పంచుకున్నారు.
గూడూరుటౌన్: పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి గ్రౌండ్లో జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు ఆనంద కోలాహలాల మధ్య మ్యాచ్ చూశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయడానికి అనుమతించిన శాసనసభ్యులు వరప్రసాదరావు, ఆర్డిఓ కిరణ్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు.
సోమల: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు వీలుగా మండల కేంద్రమైన సోమల ఉన్నత పాఠశాల ఆవరణంలో క్రికెట్ అభిమానులు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు బిగ్ స్క్రీన్‌లో ఫైనల్ మ్యాచ్ తిలకించే విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.