ప్రజాశక్తి - రాజమహేంద్రవరం భవిష్యత్తు బాగుం డాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్య మంత్రి కావాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 3వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. టిడిపి నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. టిడిపి హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. టిడిపి-జనసేన కూటమి అధికారం చేపట్టిన తరువాత మేనిఫెస్టో ప్రకారం యువతకు ఉపాధి కల్పన, మహిళలకు మూడు సిలిండర్లు ఉచితం, ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం, పిల్లల భవిష్యత్ వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసి ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, అండలూరి చంద్రశేఖర్, అండలూరి సత్యనారాయణ, అహ్మదున్నీషా బేగం, దమరసింగ్ బ్రహ్మాజీ, పెందుర్తి నాగమణి, తదితరులు పాల్గొన్నారు.