డిసెంబర్ 8 నుండి నిరవధిక సమ్మె
ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ
ప్రజాశక్తి - నంద్యాల
అంగన్వాడీ కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిన్నటి రోజున కమిషనర్ని మూడు యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు గుంటూరు స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి వెళ్లి చర్చించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కావున డిసెంబర్ 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ మూడు యూనియన్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అంతా సమ్మెలో వెళ్తున్నామని అధికారులకు సమ్మె నోటీసు అందజేసినట్లు తెలిపారు. గత 48 సంవత్సరాల నుండి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లతో పాలక ప్రభుత్వాలు గౌరవ వేతనం పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని అన్నారు. ఎపిలో వర్కర్లకు రూ. 11,500, మినీ వర్కర్లకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 7 వేలు ఇస్తూ ఎలాంటి ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్,పెన్షన్ గ్రాడ్యూటీ, సౌకర్యాలు లేకుండా రోజురోజుకు యాప్స్ పేరుతో పని భారం పెంచుతున్నారని చెప్పారు. పనిభారం తగ్గించి, వేతనాలు పెంచాలని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనలు, పరోక్షంగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు సమస్యల పరిష్కరానికి కృషి చేయడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్ సెంటర్లకు బడ్జెట్లో నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 25న విజయవాడలో మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేసినప్పటికీ, అసెంబ్లీలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు పై సమస్యలు చర్చించినప్పటికీ మంత్రులు సరియైన సమాధానం చెప్పక దాటవేశారని అన్నారు. అక్టోబర్ 9వ తేదీ సంబంధిత శాఖ కమిషనర్‌తో మూడు యూనియన్ల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ కమిషనర్ నెలాఖరు వరకు సమయం అడిగినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సన్నద్ధం కోసం ఈ నెల 20న జిల్లా పిడి, సిడిపిఒలకు సమ్మె నోటీసులు ఇస్తున్నామని, 23న ఆయా జిల్లా కేంద్రాల్లో కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు, 25 నుండి 30వ తేదీ వరకు సెక్టార్ సమావేశాలలో కార్మికులను సన్నద్ధం చేస్తామని తెలిపారు. డిసెంబర్ 6న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సమ్మె నోటీసు అంబేద్కర్ విగ్రహానికి అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు. సమస్యలను పరిష్కారం చేసేదాకా డిసెంబర్ 8వ తేదీ నుండి సమ్మెలో వెళ్తున్నామని, కార్మికులు, యూనియన్ నాయకులు సమిష్టిగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సరోజినమ్మ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పి.సుంకయ్య, రమేష్ బాబు, బాలకృష్ణ, అబ్బాస్, భాస్కర్, శ్రీనివాసులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.