ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ దళిత యువకుడు బొంతా మహేంద్ర మరణం బాధాకరమని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బొంతా మహేంద్ర కుటుంబ సభ్యులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి ప్రతిదాడి సరియైన మార్గం కాదని యువత సంయమనం పాటించాలని అన్నారు. మృతుడు మహేంద్రని తిరిగి తీసుకురాలేమని, యువకుడి మృతితో ఆవేదనతో ఉన్న కుటుంబానికి ఓదార్చడం కనీస బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మహేంద్ర ఆత్మహత్యకు కారణాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి, కారకులపై ఖఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. యువకుడి మృతి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, గంటల వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు, వైసిపి పక్షాన మరో రూ.10 లక్షలు అందించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మెన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు అజ్జరపు వాసు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.