దేని గురించైనా పూర్తిగా తెలిస్తేనే మనకు దాని ఉపయోగాలు తెలుస్తాయి. అప్పటివరకూ దాన్ని ఓ పనికిమాలిన దానిలానే చూస్తాం.. అయితే ఓ మొక్క విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పిజె (ప్రోసోపిన్ జులిఫ్లోరా) అనే మొక్కను ఇన్నాళ్లూ ఓ పనికిమాలిన మొక్కగానూ, కంపచెట్టుగానూ భావించాం. 'ఏలియన్ వీడ్'గా పిలిచే ఈ మొక్కలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. లక్షల ఎకరాల పంటభూములను నాశనం చేస్తున్న ఈ మొక్క ఎందుకూ పనికిరాదని భావించిన వారికి శాస్త్రవేత్తల పరిశోధనా పత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు దాని కథేంటి? దానిలోని ఉపయోగాలేంటి? తెలుసుకుందాం !
గుజరాత్‌లోని కచ్ ప్రాంత ప్రజల జీవనోపాధిని నాశనం చేసిన ఓ కలుపు మొక్క గురించి ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎంతో హానికరమైన గాండో బవల్ లేదా ప్రోసోపిస్ జులిఫ్లోరా-పిజె అనే మొక్క. కచ్ ప్రాంతంలోని లక్షల ఎకరాల్లోని సాంప్రదాయ బన్నీ గడ్డి భూములను నాశనం చేసింది. దీన్ని స్థానికులు 'గ్రహాంతర కలుపు' మొక్కగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దీనికి కంపచెట్టుగా పేరుంది. ఇది మేకలు మేయడానికి, వంట చెరుకుకు తప్ప దేనికీ పనికిరాదు. పంట పొలాలను నాశనం చేస్తుందన్న కారణంతో రైతులు వీటిని నరికేస్తుంటారు. అయితే తాజాగా దీనిపై నిర్వహించిన పరిశోధనలు మాత్రం స్థానికులకు శుభవార్తగా మారింది.
బన్ని గడ్డి భూములను కాపాడేందుకు ఈ పిజె కలుపు మొక్కలను నిర్మూలించాలని కొన్నాళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జియుఐడిఇ (గైడ్-గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెసర్ట్ ఎకాలజీ) ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం మాత్రం ఇందుకు విరుద్ధమైన వాదనలను ప్రజల ముందుంచింది. పిజె మొక్కల పెంపకం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ఇందులో సూచించింది. ఈ కలుపు మొక్కలు లక్షలాది మంది స్థానికులకు ఉపాధి కల్పించగలవని గైడ్ వెల్లడించింది.
పిజె మొక్కలను వివిధ రకాల పదార్థాల తయారీలో వాడవచ్చని పరిశోధకులు గుర్తించారు. బ్రెడ్, బిస్కెట్, సిరప్, కాఫీ, కాక్‌టెయిల్, బ్రాందీ వంటి ఉత్పత్తుల తయారీలో దీన్ని ఉపయోగించవచ్చని తెలిపారు. దాని కలపను బొగ్గు తయారుచేయడానికి, తద్వారా విద్యుదుత్పత్తికి ఉపయోగించవచ్చని పరిశోధనా పత్రం పేర్కొంది. వివిధ దేశాల్లో పిజె వినియోగం ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే దీని పూర్తిస్థాయి సామర్థ్యంపై సరైన అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. దీని ఉత్పత్తులు మనదేశంలో ప్రాచుర్యం పొందలేదు. అందువల్ల వీటిపై విస్తృత అవగాహన కల్పించాలని, పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
గ్లోబల్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఫ్రాంటియర్ రీసెర్చ్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రం.. కొత్త పరిశ్రమలతో పాటు, కొత్త ఉపాధి సృష్టికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని, ఇతర దేశాల్లో ఫలితాలను చూస్తే ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పేర్కొంది. పిజె విషయంలో ప్రత్యేక మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించాలని చెబుతున్నారు అధ్యయన రచయితల్లో ఒకరు, గైడ్ డైరెక్టర్ విజరుకుమార్. గ్రహాంతర జాతిగా పరిగణిస్తున్న ఈ మొక్క ద్వారా ఆర్థిక, పర్యావరణ ప్రయోజ నాలూ ఉంటాయని చెబుతున్నారు. పిజె లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుని, దాని కోసం కొత్త ప్రణాళికను రూపొందించాలన్నారు. సరైన ప్రణాళిక.. భారీ ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
'ప్రోస్పోసిస్: ఎకోలాజికల్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఛాలెంజెస్' అనే పేరుతో ఒక పరిశోధనా పత్రాన్ని 2009లో గైడ్ ప్రచురించింది. అందులో గండో బవల్ సామర్థ్యాలను ప్రస్తావించారు. ఇది ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించే ఒక ఇన్వాసివ్ గ్రహాంతర జాతి మొక్క అని, దీని విషయంలో ఇదొక్కటే ప్రతికూల అంశమని ఆ పత్రంలో పేర్కొన్నారు. అయితే దీన్ని నియంత్రించగలిగితే.. ఈ మొక్కల ద్వారా మానవాళి భారీ ప్రయోజనాలను పొందగలరని పరిశోధనా పత్రం నివేదించింది.
గత శతాబ్ద కాలంగా దీని కలపను స్థానికులు గృహావసరాలకు వినియోగించారు. నెమ్మదిగా మండే ఈ కలప ద్వారా పెద్దగా పొగ కూడా రాదు. దీని కెలోరిఫిక్ విలువ సైతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఉత్పత్తి అయిన బయోమాస్‌ను విద్యుదుత్పత్తిలో ఉపయోగిస్తున్నారు. పిజె ద్వారా విద్యుదుత్పత్తి ఖర్చూ చాలా చౌకగా ఉంటుంది.