- పాడి రైతులు ఆందోళన
- లక్షల విలువైన గేదెలు రూ.10వేలకే అమ్మకం
- ఆర్థికంగా చితికి పోతున్న పాడి రైతు
ప్రజాశక్తి - అద్దంకి
తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత రైతులు పాడిగేదెలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు గేదెలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాంటి గేదెలకు వైరస్ సోకడంతో తిమ్మాయపాలెం పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాడిపరిశ్రమపై ఆధారపడ్డ రైతులు కుదేలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు పాలు అమ్మకాల ద్వారా పోషణ సాగిస్తున్నారు. పాడిపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇంటి ఖర్చులతోపాటు పిల్లల చదువులు, శుభకార్యాలు, ఇతర ఖర్చులు జరుపుకుంటున్నారు. ఇటీవల మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో పాడి గేదెలకు అంతుచిక్కని వైరస్ సోకడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో దాదాపు పదుల సంఖ్యలో పాడి గేదెలకు వింతైన వైరస్ సోకడంతో దాణా, పశు గ్రాసం, తాగునీరు లేక నీరసించి పడిపోతున్నాయి. పశు వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకోవడం లేదు. చేసేది ఏమీ లేక పాడి రైతులు లక్షల విలువైన గేదెలను రూ.5వేల నుండి 10వేలకు అమ్ముకుంటున్నారు. ఈపాటికే గ్రామంలోని అడుసుమల్లి మురళి, వీరాంజనేయులు, మందలపు శ్రీకాంత్ తదితర పాడి రైతులకు చెందిన గేదెలు వైరస్ బారిన పడ్డాయి. అద్దంకి వెటర్నరీ ఏడి మోహనరావు ఆధ్వర్యంలో గేదెలకు చికిత్స అందిస్తున్నారు.