ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.
మునగపాక రూరల్ : స్థానిక శాఖ గ్రంథాలయంలో యుద్ధాల నివారణలో యుఎన్ఓ పాత్ర అనే అంశంపై వక్తృత్వ పోటీ, నిత్యజీవితంలో యోగ ప్రాధాన్యత అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఎల్వి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణీతులుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శివ కోటి దుర్గ ప్రసాద్, శ్రీనివాసరావు, ఆశా దేవి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెంటకోట తులసిరావు వ్యవహరించారు.
అనకాపల్లి : స్థానిక శాఖవీధి శాఖా గ్రంథాలయాధికారి కె.శ్రీనివాసరావు అధ్వర్యంలో శనివారం జివిఎంసి టౌన్ గర్ల్స్ హైస్కూల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి చరిత్రపై వ్యాసరచన పోటీలు, జివిఎంసి పట్టణ ప్రాధమిక పాఠశాలలో చిత్ర లేఖనం, క్విజ్, డిబేట్ పోటీలు, చిన్నవీధి జివిఎంసి జార్జి ఎలిమెంటరీ పాఠశాలలో క్యారమ్స్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సుమారు 80 విద్యార్థులు పాల్గొనగా, 36 మంది విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో బల్లా నాగభూషణం, హెచ్ఎంలు కె.రుధిరారాణి, హసీనా బేగం, మాధవి పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : బుచ్చయ్యపేట శాఖ గ్రంధాలయంలో శనివారం వక్తృత్వ, వ్యాచరచన పోటీలు వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రంథాలయ పాలకుల కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక శాఖా గ్రంథలయంలో గ్రంథాలయ అధికారి వి.శిరీష శనివారం విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు రాధా కుమారి ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిఈ స్కూల్ ఉపాధ్యాయులు నాగేశ్వరి, రామలక్ష్మి, మనోజ్ పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం శాఖా గ్రంధాలయంలో ఐదవ రోజు శనివారం కవి సమ్మేళనం, సీనియర్స్, జూనియర్స్ విభాగంలో డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. కవి సమ్మేళనంలో తెలుగు ఉపాధ్యాయులు నండూరి ప్రసున్న, ఎ.విజయదుర్గ, కె.నాగరత్నం, ఎస్.పార్వతి, బి.వెంకటలక్ష్మి, కె.మహాలక్ష్మి గ్రంథాలయాధికారి కె.జగన్నాథం పాల్గొన్నారు.
అచ్యుతాపురం : అచ్చుతాపురం గ్రంథాలయం ఆవరణలో శనివారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దొడ్డి కోటేశ్వరరావు, ఏడు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలో పెదబోదుగల్లం హైస్కూల్లో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చరవాణి (మొబైల్) వాడటంతో కలిగే ఉపయోగాలు, నష్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయులు ఎన్విఎస్ ఆచార్యులు, పలువురు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జనార్దన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
పాయకరావుపేట : స్థానిక గ్రంథాలయంలో సీనియర్స్, జూనియర్స్‌కు యోగా పోటీలను నిర్వహించారు. పాయకరావుపేట మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి చిట్టిబాబు హాజరయ్యారు. న్యాయ నిర్ణీతలుగా వేములూరి వరప్రసాద్, వెంకట రమణ, ఎస్ సీతారామమూర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి లక్ష్మణరావు, కమిటీ సభ్యులు సీతారామయ్య, రత్నం పాల్గొన్నారు
ఎంవిపి.కాలనీ : ఎంవిపి కాలనీ నగర శాఖ గ్రంథాలయంలో స్థానిక పాఠశాలల విద్యార్థులకు, ఎఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి మహేష్, మాజీ కౌన్సిలర్ ఎం.లక్ష్మణరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీతమ్మధార: విశాఖ పౌర గ్రంథాలయంలో క్రియేటివ్ కామెడీ క్లబ్ ఆధ్వర్యాన ప్రత్యేక వినోదవల్లరి నిర్వహించారు. కొణతాలసురేష్ భక్తి గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నటరాజ నృత్య నికేతన్ నాట్యాచార్యులు బాబూరావు నేతృత్వంలో చిన్నారులు జానపద నృత్యాలను ప్రదర్శించారు. ఎం.జ్యోత్స్న, ఎం.మోనశ్రీ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డిఆర్కె.రావు, వేముల భాస్కరాచారి, తాళాభక్తుల లక్ష్మీ ప్రసాద్, తాతాచారి, మేడా మస్తాన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ గెసిల్లా మాట్లాడుతూ, పుస్తక సమీక్ష వల్ల నూతన ఆలోచనలు, సృజనాత్మకత శక్తి పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి.ఆదిశేషు, వి.లక్ష్మీదేవి, వై అనసూయదేవి, రోజా, ప్రేమలత, అబీద బేగం, జ్యోత్స్న, సలోమి పలు పుస్తకాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి, గ్రంథాలయాధికారి జి.శిరీష, అధ్యాపకులు త్రివేణి పాల్గొన్నారు.
అలరించిన కవి సమ్మేళనం
నర్సీపట్నంటౌన్ : స్థానిక శాఖా గ్రంధాలయంలో కవి సమ్మేళనం అలరించింది. పెదబొడ్డేపల్లి తెలుగు స్కూల్ అసిస్టెంట్ టి.పరశురాముడు ప్రసంగం, కవితలు పాఠకులను అలరించాయి. గ్రంధాలయాల్లో పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని ప్రభుత్య జూనియర్ కళాశాల లైబ్రేరియన్ కె.శ్రీనివాసులు సూచించారు. గ్రంధాలయాధికారి పి.దమయంతి ఆధ్యర్యంలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్యహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత గ్రంధాలయాధికారి జి.మురళీకృష్ణ, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు పి.ప్రభాకరరావు పాల్గొన్నారు.
గొలుగొండ : గ్రంధాలయాధికారి రాజుబాబు ఆధ్వర్యంలో గ్రంథాలయ ప్రముఖులైన ఎస్సార్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణ, గాడి చర్ల హరిసర్వోత్తమరావులకు నివాళ్లు అర్పించారు. అనంతరం మత్తు పదార్థాలు యువతపై ఎటువంటి ప్రభావంపై డిబేట్ నిర్వహించారు.
రోలుగుంట : 56వ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా రోలుగుంట గ్రంధాలయంలో శనివారం గ్రంధాలయాధికారి వరలక్ష్మీ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. కళాశాల లైబ్రెరియన్ మల్లికార్జునరావు, జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు అరుణ్‌కుమార్, కేజివిబి వి.లక్ష్మీ హాజరయ్యారు. అనంతరం గ్రంధాలయ ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు.