అనంతపురం కలెక్టరేట్ : కురుబలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుడికట్ల కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. నేతలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. కురబలంతా ఐక్యంగానున్నారు.. నాయకులే సరిగాలేరని ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు నిదర్శనం వేదికపైనున్న నాయకులేనని బికె.పార్థసారధిని ఉద్ధేశించి మాట్లాడారు. దీంతో పార్థసారధి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు నేతలకు సంబంధించిన మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. వారి అనుచరులు కూడా వేదికపైనే ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. సాంప్రదాయాల కోసం కురుబల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా రాజకీయ వేదికగా మారింది. దీంతో బహిరంగ సభకు వచ్చిన కురబకులస్తులు అందరూ ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. కురుబల ఐకమత్యం కోసం ఏర్పాటు చేసిన స్టేజీపైన ఇలా వ్యవహరించడం సరైంది కాదని సంఘం నాయకులు తెలిపారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సర్దిజెప్పారు. అక్కడి నుంచి గోరంట్ల మాధవ్, మంత్రి ఉషశ్రీచరణ్ వెళ్లిపోయారు. సభావేదికపై ఉన్న ఇతర నేతలు, పోలీసులు కలుగజేసుకుని దూషణలు చేసుకుంటున్న వారికి సర్ధిచెప్పి శాంతింపజేశారు. దేవుడి కార్యం వెనుక రాజకీయం ఏమిటంటూ అక్కడున్న వాళ్లంతా నేతలపై అసహనం వ్యక్తం చేశారు.