Nov 19,2023 21:12

గుమ్మలక్ష్మీపురం : పెదమేరంగిలో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

గుమ్మలక్ష్మీపురం: వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో రోడ్లు దుస్థితి సిఎం జగన్మోహన్‌ రెడ్డికి కనిపించలేదా అంటూ కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జియమ్మవలస మండలం పెదమేరంగి కూడలి వద్ద టిడిపి-జనసేన నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కళ్లు తెరిచి చూడాలని సూచించారు. రోడ్లు పూర్తిగా పాడై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. అయినా ప్రభుత్వం ప్రమాదాల నివారణకు రోడ్లను మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రధానంగా రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని అన్నారు. వైసిపి కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. రోడ్ల దుస్థితిపై పాదయాత్ర చేపట్టి మోకాళ్లపై వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సంద్భంగా గుంతలను కప్పుతారా? రోడ్లు వేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ పల్లా రాంబాబు పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.
సాలూరు: వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తిగా ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర నియోజకవర్గంలో రోడ్లు గుంతలతో నిండి వున్నాయన్నారు. సాలూరు నుంచి మక్కువ రోడ్డు నిర్మాణ పనులు ఎన్నాళ్లు సాగిస్తారని ప్రశ్నించారు. వాహనదారులు ఆ రోడ్డు మీదుగా వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏజెన్సీ గ్రామాల కు రోడ్లు నిర్మిస్తామని చెప్పిన డిప్యూటీ మాట తప్పారని విమర్శించారు. పాచిపెంట మండలం శతాబ్ది, మూటకూడు గ్రామాలకు, సాలూరు మండలం డెన్సరాయి, సంపంగిపాడు గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన రాజన్నదొర పట్టించుకోలేదని సంధ్యారాణి అన్నారు.
సీతంపేట : టిడిపి-జనసేన పార్టీల పిలుపు మేరకు తెలుగుదేశం నాయకులు పడాల భూదేవి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీతంపేట మండలం కీసరజోడు, జరడ కాలనీల్లో రోడ్ల గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కీసరజోడు వద్ద రోడ్డు గోతులమయమవ్వడంతో పాటు కల్వర్టు కూడా మరమ్మతులకు గురయిందన్నారు. ఈ రహదారి గుండా 14 గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు భామిని మండల రైతులు కూడా రాకపోకలు చేస్తుంటారని రోడ్డు మరమ్మతుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే చినబగ్గ పంచాయతీ పరిధిలో ఉన్న జరడ కాలనీ రోడ్డు అధ్వాన్నంగా ఉందన్నారు. సీతంపేట మండలంలో అనేక గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి రహదారుల పనులు చేపట్టి నరకం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆరిక మురళీ, పువ్వల ఖగేశ్వరరావు, తాడంగి కాళిదాసు, ఊయక ప్రసాద్‌, బాలరాజు, మీనక పగడాలమ్మ, తాడండి రత్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు.