వాషింగ్టన్ : జర్నలిస్టుల స్థానంలో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ని భర్తీ చేయబోమని గూగుల్ గురువారం స్పష్టం చేసింది. జర్నలిస్టులకు వార్తా కథనాలను పరిశోధించడంలో మరియు రాయడంలో సహాయపడటానికి మాత్రమే ఎఐ సాధనాలను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. వార్తలను సేకరించడంలో అత్యవసరమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల స్థానంలో ఎఐ సాధనాలను భర్తీ చేయబోమని వెల్లడించింది. హెడ్‌లైన్‌లు లేదా విభిన్న రైటింగ్ శైలులను ఎంపిక చేయడం కోసం జర్నలిస్టులకు సహాయకులుగా పనిచేసేందుకు ఎఐ సాధనాలను అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. పలు మీడియా అవుట్ లెట్స్ ముఖ్యంగా చిన్న చిన్న ముద్రణా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. వ్యక్తుల కోసం జిమెయిల్, గూగుల్ డాక్స్‌లను అందుబాటులో ఉంచినట్లు, వారి పని, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను జర్నలిస్టులకు అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని గూగుల్ ప్రతినిధి జెన్ క్రైడర్ తెలిపారు. ప్రకటనా రాబడి క్షీణించడంతో 2023 మొదటి ఐదునెలల్లో అమెరికాలోని పలు మీడియా సంస్థలు రికార్డు స్ధాయిలో 17,436 ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎఐ ఆధారిత సాధనాలతో ఉద్యోగులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉండవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారం ఓపెన్ ఎఐతో భాగస్వామ్యం కలిగి వున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది.