* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - పొందూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం హైకోర్టు తీర్పుతో రుజువైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. మండలంలోని రాపాకలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక నేరస్తుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడును అవినీతిపరునిగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబుపై ఒక్క అవినీతినైనా నిరూపించగలిగారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబుపై రూ.ఆరు లక్షల కోట్ల దోపిడీ అని, పింక్ డైమండ్ అని రకరకాల ప్రచారం చేశారని, ఏదైనా నిరూపించగలిగారా అని అన్నారు. చట్టాలు, వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైలులో ఉంచారని, అవే వ్యవస్థలు సక్రమంగా పనిచేసి జగన్, మంత్రులతో పాటు అవినీతికి పాల్పడిన వారంతా కటకటాల వెనక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహనరావు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కరరావు, నాయకులు కె.సన్యాసిరావు, కె.అప్పలనాయుడు, పి.పారంనాయుడు తదితరులు పాల్గొన్నారు.