ప్రజాశక్తి-పిసిపల్లి: పీసీపల్లి మండలంలోని పెదయిర్లపాడు జడ్పీ హైస్కూల్ స్థలంలో అధికార పార్టీ నాయకులు అక్రమ కట్టడాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారని అదే గ్రామానికి పెద్దిరెడ్డి వెంగళరెడ్డి ఆరోపించారు. పెదయిర్లపాడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, వైసిపి నాయకులు అలవల నరసింహారెడ్డి.. ప్రభుత్వ హైస్కూల్ స్థలంలో అక్రమంగా శాశ్వత కట్టడాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. పెదఇర్లపాడు జడ్పీ హైస్కూల్ ఆనుకొని రోడ్డుకు ఇరువైపులా అనేకమంది అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్నారు. రోడ్డు వెంబడి బలవంతంగా దౌర్జన్యం చేసి కట్టడాలు నిర్మించి వేల రూపాయలకు అద్దెకిస్తున్నారని వెంగళరెడ్డి తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. గతంలో ప్రభుత్వ స్థలంలో చిన్నాచితక వ్యాపారులు తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసేవారని అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో అధికార పార్టీతో కొనసాగుతున్న అలవల నరసింహారెడ్డి భారీగా కట్టడాలను అద్దెలకిస్తున్నారని, దీనివలన ప్రభుత్వ హైస్కూల్ స్థలం పరుల పాలవుతోందని అన్నారు. అనధికారికంగా, అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయని తెలిపారు. హైస్కూల్‌కు కొందరు దాతలు ఉచితంగా స్థలం ఇచ్చి పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. కానీ ఇప్పుడు కొందరు వాటిని కబ్జా చేశారని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమించిన స్థలాలలో నిర్మించిన కట్టడాలు తొలగించి హైస్కూల్ వారికి స్వాధీనం చేయాలని వెంగళరెడ్డి డిమాండ్ చేశారు.