ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : జివిఎంసి 35వ వార్డు పరిధిలోని పురాతనమైన ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధి పనులను సుమారు రూ.164.50 లక్షలతో చేపట్టనున్నట్లు మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావుతో కలిసి మేయర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో పలు స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వ్యర్థాలు అధికంగా ఉన్నాయని, వాటిని తొలగించి ఆధునికీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్లు, కాలువలు, ఆడియన్స్ కూర్చునేందుకు బల్లలతో పాటు గదుల ఏర్పాటు తదితర పనులు చేయనున్నట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జివిఎంసి నిధులతో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ 4 కమిషనర్ శివప్రసాద్, జివిఎంసి కార్యనిర్వాహక ఇంజినీరు సంతోషి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.