May 22,2022 11:57

భూమి నుంచి ఇతర గ్రహానికి మకాం మార్చాలనే ఆలోచన మానవుల్లో నానాటికీ పెరిగిపోతోంది. ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం అంతుచిక్కని విశ్వ రహస్యాలను కనిపెట్టే ప్రయత్నంలో మానవాళి ఎప్పుటకప్పుడు ముందడుగు వేస్తూనే ఉంది. అయితే పచ్చని చెట్లు, నీరు, జీవం వంటి సహజగుణాలు కేవలం భూమిపై మాత్రమే ఉన్నాయి. కాగా మనిషి మనుగడకు అత్యంత ప్రధానమైన మొక్కలను భూమి మీద మాత్రమే కాదు.. అంతరిక్షంలోనూ పండించవచ్చని తాజా పరిశోధనలో తేలింది. దీంతో భవిష్యత్తులో భూమి కాకుండా చంద్రుడిపైనా చెట్లను చూడగలమా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిశోధనలు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి ఆలోచనకు ఇది అతిపెద్ద ముందడుగు. ఇందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి ఏంటి? వారు చెబుతోన్నదేంటి? తెలుసుకుందాం.

moon


అనంత విశ్వంలో రేణువంత లేని భూమికి ప్రత్యామ్నాయం దొరుకుతుందా? మానవ మనుగడకు అత్యంత ప్రధానమైన మొక్కల జాడ ఎక్కడైనా ఉందా? తాపం పెరిగి నేలతల్లి ప్రకోపించేలోపు మరోచోట మనం జీవించగలమా? అనే ప్రశ్నలకు ప్రాథమికంగా సమాధానం దొరికింది. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు వ్యవసాయానికి అనుకూలమని తేలింది. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం చోటుచేసుకుంది. ఈ పరిశోధన నాసా యొక్క దీర్ఘకాలిక గ్రహాంతర అన్వేషణ లక్ష్యాలకు కీలకంగా మారనుంది. 
కాగా చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని 'రెగోళిత్‌'గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. 1969-72 మధ్య కాలంలో అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టిన అప్పటి శాస్త్రవేత్తలు ఈ 'రెగోళిత్‌'ను (జాబిల్లి మీద నుంచి మట్టి నమూనాలను) భూమికి తీసుకువచ్చారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు 'రెగోళిత్‌' సారంపై పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు తొలిసారి పోషకాలు లేని చంద్ర రెగోలిత్‌లో పరిశోధకులు ఎంతో శ్రమపడి, అధ్యయనం చేశారు. వీరు 'అరబిడోప్సిస్‌ థాలియానా' అనే మొక్కను పెంచారు.
భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే, విశ్వంలో పనిచేసే వ్యోమగాముల కోసం ఆహార వనరుల అభివద్ధికి ఇలా ఇతర గ్రహాలపై ఉన్న వనరుల్ని ఉపయోగించు కోవాల్సి ఉంటుంది. 'వ్యవసాయ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి నాసా ఎలా పనిచేస్తుందో కూడా ఈ ప్రాథమిక మొక్కల పెరుగుదల పరిశోధన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చంటున్నారు. భూమిపై ఆహార కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కలు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్ని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడంలో విశ్లేషించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

moon


నిస్సారవంతమైన మట్టిలో..
భూసారం వలే కాకుండా.. చంద్రుడి రెగోళిత్‌ (చంద్రుడిపై మట్టి) అగ్నిపర్వత బూడిద కలిగి ఉంటుంది. అటువంటి నిస్సారవంతమైన మట్టిలో మొక్కలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోయారు. అయితే గత కొన్నేళ్లుగా జరిపిన పరీక్షల ఆధారంగా.. ఒక నియంత్రిత వాతావరణంలో గాలి, వెలుతురు, నీరుని నియంత్రిత పద్ధతిలో అందించడం ద్వారా చంద్రుడి రెగోళిత్‌పై మొక్కలు విజయవంతంగా పెంచగలిగినట్టు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో హార్టికల్చరల్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఫెర్ల్‌ వివరించారు. రాబర్ట్‌ ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించారు. అయితే చంద్రుడి మట్టిలో మొక్కల పెంపకంతో మున్ముందు అంతరిక్షంలోనే ఆహార పంటల సాగు జరిగే అవకాశం ఉంది.
 

moon

12 గ్రాముల ల్యూనార్‌ సాయిల్‌లో..
చేతి వేలు పట్టేంత పరిమాణం గల చిన్నపాటి ట్యూబ్స్‌లో ల్యూనార్‌ సాయిల్‌ (రెగోళిత్‌) ను వేయాలి. వాటిలో విత్తనాలు నాటి ప్రతిరోజూ న్యూట్రియెంట్‌ సొల్యూషన్‌ను అందిస్తూ మొక్కలను మొలిపించారు. పరిశోధకుల తాజా ప్రయోగంలో కేవలం 12 గ్రాముల ల్యూనార్‌ సాయిల్‌ను ఉపయోగించారు. చంద్రుడి మట్టిలో మొదటిసారి మొలిచిన మొక్కలు ఆవాలు తరహాలో ఉండే క్యాలిఫ్లవర్‌ జాతికి చెందినవి. ఈ విత్తనాలు యూరప్‌-ఆసియా, ఆఫ్రికాలో ఉంటాయి. అయితే లూనార్‌ సాయిల్‌ విషయంలో అమెరికా సైంటిస్టులు సాధించిన ఈ విశేషానికి సంబంధించిన వివరాలను 'కమ్యూనికేషన్స్‌ బయాలజీ' అనే జర్నల్‌ ప్రచురించింది. ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా చంద్రునిపైకి మళ్లీ వెళ్లాలని నాసా సిద్ధమవుతోంది. చంద్రుని ఉపరితలంపై మానవుడు శాశ్వతంగా ఉండేవిధంగా చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో వెళ్లబోతోంది. అదేవిధంగా ల్యూనార్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు చైనా, రష్యా చేతులు కలిపాయి. దీర్ఘకాలిక పరిశోధనల లక్ష్యాలకు తాజా పరిశోధన అత్యంత కీలకమైనదని నాసా చీఫ్‌ బిల్‌ నెల్సన్‌ అంటున్నారు.