Mar 13,2022 22:51
  • భూమిపై జీవం ఆవిర్భవించి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జీవంలో మార్పులు జరుగుతూనే ఉంది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకూ ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుకకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే భూమి పుట్టుకకు సూపర్‌ మౌంటెన్స్‌ కారణమని తేల్చారు. కాగా ఈ సూపర్‌ మౌంటెన్స్‌ భూమిపై రెండుసార్లు ఉద్భవించాయని గుర్తించారు. అయితే ఈ సూపర్‌ మౌంటెన్స్‌ ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటి ద్వారా భూమిపై జీవం ఎలా ఉద్భవించింది? అసలు శాస్త్రవేత్తలు గుర్తించిన అంశాలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం..!

భూమి ఆవిర్బావం.. దాని పుట్టుకపై శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలనూ గుర్తించారు. అయితే నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ పరిశోధనల్లో ఎప్పటికప్పుడు అనేక కొత్త విషయాలనూ గుర్తిస్తున్నారు. తాజాగా భూమిపై జీవం ఆవిర్భావానికి మూల కారణమైన 'సూపర్‌ మౌంటెన్స్‌'ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రెండు వేల నుంచి 180 కోట్ల సంవత్సరాల క్రితం ఒకసారి సూపర్‌ మౌంటెన్స్‌ ఏర్పడగా, 65 నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం రెండోసారి ఈ సూపర్‌ మౌంటెన్స్‌ ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే భూమిపై ఉన్న పురాతన పర్వతాలైన హిమాలయాలు కంటే ఈ 'సూపర్‌ మౌంటెన్స్‌' పురాతనమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • నాలుగు రెట్లు పెద్దవి..

హిమాలయాల కంటే నాలుగు రెట్లు పెద్దవైన 'సూపర్‌ మౌంటెన్స్‌' గతంలో భూమిపై ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాలకు ముందు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలు ఇవేనని వారు తేల్చారు. ఇవే భూమిపై జీవం ఆవిర్భావానికి దోహదం చేశాయనీ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ప్రస్తుతం మనుగడలో లేవు. మనం నివసిస్తున్న ఈ భూమిపై ఒకప్పుడు జీవం అనేదే లేదు. పర్వతాలు, నదుల కారణంగా భూమిపై జీవం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై ఎత్తయిన పర్వతశ్రేణులు హిమాలయాలు. ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్‌ (8, 848 మీటర్లు) కూడా హిమాలయాల శ్రేణిలోనే ఉంది. అయితే ఒకప్పుడు హిమాలయాల కంటే ఎత్తయిన పరిధిలో పర్వతాలు ఉండేవని, అవే మన భూమి పరిణామానికి సాయపడ్డాయని సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు.

జీవానికి మూలం 'సూపర్‌ మౌంటెన్స్‌'

  • చరిత్రలో రెండు సార్లు..

సూపర్‌ మౌంటెన్స్‌ ఒకప్పుడు భూమి అంతటా వ్యాపించి ఉండేవట. ఇవి హిమాలయాల కన్నా పెద్దవిగా ఉండేవట. దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల వరకూ విస్తరించిన ఈ సూపర్‌ మౌంటెన్స్‌ ప్రస్తుత హిమాలయ శ్రేణుల (2,300 కిలోమీటర్లు) కంటే దాదాపు నాలుగు రెట్లు పెద్దవి. అంతేకాదు ఇవి భూమి చరిత్రలో రెండుసార్లు ఏర్పడ్డాయి. 200 నుంచి 180 కోట్ల సంవత్సరాల క్రితం ఒకసారి, 65 నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం మరోసారి ఇవి ఏర్పడ్డాయని సైంటిస్ట్‌లు వెల్లడించారు.
నాలుగు రెట్లు పెద్దవి..
ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ లెటర్స్‌ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో పరిశోధకులు తక్కువ లుటీటియం కంటెంట్‌తో ఉన్న జిర్కాన్‌ జాడలను గుర్తించారు. అది అరుదైన భూమి మూలాల్లో, అధిక పర్వతాల మూలాల్లో మాత్రమే కనిపిస్తుంది. 'ఈ రెండు సూపర్‌ మౌంటెన్ల లాంటి మౌంటెన్‌ రేంజ్‌లు ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. ఇవి కేవలం ఎత్తులోనే కాదు విస్తారంలోనూ పెద్దవి. 2,400 కిలోమీటర్ల పొడవైన హిమాలయాలు నాలుగుసార్లు పునరావృతం అయితే ఎంత పెద్దగా ఉంటాయో ఊహించగలిగితే, సూపర్‌ మౌంటెన్స్‌ స్కేల్‌ గురించి ఒక ఆలోచన వస్తుంది' అని అధ్యయన బృంద సభ్యులు జియీ జూ వివరించారు.

  • జీవానికి మూలం..

మొట్టమొదటి సూపర్‌ మౌంటెన్స్‌ను 'నునా సూపర్‌ మౌంటెన్స్‌' అని పిలుస్తారు. ఇవి క్రమంగా కరిగి నీరు, నదులకు దారితీస్తాయి. తద్వారా మొక్కలు, జంతువులు వృద్ధి చెందుతాయి. 65 నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించిన సూపర్‌ మౌంటెన్స్‌ను 'ది ట్రాన్స్‌ గోండ్వానన్‌ సూపర్‌ మౌంటెన్‌' అంటారు. ఇవి భూమిపై అతిపెద్ద జంతువులు నివసించే సమయంలో ఉన్నాయి. సూపర్‌ మౌంటెన్లు ఏర్పడిన ఈ రెండు సందర్భాలకు, భూమి పరిణామంలోని రెండు ముఖ్యమైన కాలాలకూ మధ్య సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

జీవానికి మూలం 'సూపర్‌ మౌంటెన్స్‌'

  • భూమి పరిణామం..

పర్వతాలు క్షీణించినప్పుడు, అవి మహాసము ద్రాలకు ఫాస్పరస్‌, ఐరన్‌లాంటి ముఖ్యమైన పోషకాలను అందించాయని పరిశోధకులు తెలిపారు. ఇవి జీవ చక్రాలను సూపర్‌ ఛార్జ్‌ చేసి పరిణామాన్ని నడిపించాయని, సూపర్‌ మౌంటెన్లు వాతావరణంలో ఆక్సిజన్‌ స్థాయిలనూ పెంచాయని వివరించారు. 'భూమి ప్రారంభదశలో వాతావరణంలో దాదాపు ఆక్సిజన్‌ లేదు. అనంతరం జీవులు ఉద్భవించిన తరువాత ఆక్సిజన్‌ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆక్సిజన్‌ స్థాయిలు క్రమంగా దశలవారీగా పెరిగాయి. దానికి ఈ రెండు సూపర్‌ మౌంటెన్స్‌ ఎంతగానో తోడ్పడ్డాయి' అని జియీ జూ అన్నారు. మొత్తంగా భూమి పరిణామానికి, భూమిపై జీవానికి ఈ సూపర్‌ మౌంటెన్స్‌తో సంబంధం ఉందని ఈ కొత్త పరిశోధన రుజువు చేసింది. ఈ పరిశోధనల అంశాలను ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.