Nov 20,2023 21:23

జెసికి వినతిని అందజేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

ప్రజాశక్తి - పార్వతీపురం: జిల్లాలో కరువు మండలాలు, పంచాయతీలు సర్వే చేసి ప్రభుత్వం వాస్తవికత ఆధారంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాలో కరువు, కరువు నష్టపరిహారంపై జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వేణు మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులు, కరువు వల్ల నష్టపోయిన మండలాలు గూర్చి గతంలో ప్రభుత్వానికి తెలిపినా ఇంతవరకు వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కరువు ప్రాంతాలు పర్యటించలేదని, ప్రభుత్వం వెల్లడిస్తున్న పంట నష్టపోయిన వివరాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని విమర్శించారు. పార్వతీపురం మండలంలో నాలుగు వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, కానీ అధికారులు మాత్రం కేవలం వందెకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. జిల్లాలో 15 మండలాల్లో అనేక పంచాయతీల్లో వేల ఎకరాలు పంట కోత దశలో ఎండిపోయిందని, రైతులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే కరువు నష్టాన్ని ప్రకటించి, ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు వై.మన్మధరావు, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ పాల్గొన్నారు.