ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు ప్రారంభం అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రైతులు కోతలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సోమవారం సాయంత్రానికి సుమారు 80 70 వేల ఎకరాలు కోతలు పూర్తయినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో రైతుల ఆందోళనను అవకాశంగా మార్చుకుని హార్వెస్టింగ్ మిషన్ల నిర్వహకులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గతంలో గంటకు రూ.2600 వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.3000 చొప్పున వసూలు జరుగుతోంది. ఎకరా కోతకు 1.30 గంటలు పడుతోంది అంటే అక్షరాలా రూ.600 భారం పడింది. గతలో రూ.3900 ఖర్చుకాగా ప్రస్తుతం రూ.4500కు చేరింది. జిల్లా వ్యాప్తంగా సాగు జరిగిన 1.75 లక్షల ఎకరాలపై అక్షరాలా రూ.10.50 కోట్ల భారం అదనంగా పడనుంది. గతంలో కూలీలే వరి కోతలు కోసేవారు. కాలక్రమేణా ఖర్చుతోపాటు సమయం కలిసిరావడంతో రైతులు హార్వెస్టర్ యంత్రాలపై దృష్టి సారించారు. ఎకరా పంట కోయాలంటే హార్వెస్టర్‌కు 6 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. లీటరు డీజిల్‌కు గత సీజన్‌తో పోల్చితే రూ.5 అదనంగా ధర పెరిగింది. గత రెండేళ్లుగా ఎరువులు, పురుగుల మందులు పెరడంతోపాటు డీజిల్ ఖర్చులు పెరగడంతో సాగు పెట్టుబడి పెరిగింది. నారు పోయడం, నాట్లు వేయడం, మూడుసార్లు ఎరువులు, రెండుసార్లు కలుపు, జింకు, గడ్డిమందు, కూలీల ఖర్చులు కలిపి ఎకరా సాగుకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకూ ఖర్చు అవుతోంది. కౌలు రైతులకు అదనంగా మరో రూ.3 వేలు ఖర్చు పెరిగింది. ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు రూ. 2180 చొప్పున, ప్రయివేటు మిల్లుల్లో రూ.1,600 చొప్పున చెల్లిస్తున్నారు. ఆరు నెలలు కష్టబడినా సొంత భూమి రైతులకు కూ లిసైతం గిట్టుబాటు కావటం లేదని రైతులు వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. జిల్లాలో నెలాఖరు నాటికి 90శాతం కోతలు పూర్తవుతాయని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. రాబోయే మూడువారాల్లో కోతలు 100 శాతం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఎకరాకు రూ.4500 కోతలకు ఖర్చు చేస్తున్నాం
గంటకు రూ.3000 చెల్లించాల్సిందేనని హార్వెస్టర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరా కోతకు గంటన్నర సమయం పడుతోంది. దీంతో రూ.4500 ఖర్చు అవుతోంది. ఐదెకరాల రైతుపై అదనంగా రూ.3000 భారం పడుతోంది. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో హార్వెస్టర్ల యజమానులు అడిగినంత చెల్లించి వరి కోతలు చేయిస్తున్నాము. ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. బరకాలు అందించి ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్త చేసుకునేందుకు సౌకర్యం కల్పించాలి.
-ఆర్. గోవర్ధనరావు, వరి రైతు, రాజమహేంద్రవరం గ్రామీణం