గుంటూరు శేషేంద్రశర్మ ప్రధానంగా కవిగా తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో పండితుడు. ఒక్కమాటలో ఆయనను మహాకవి అని చెప్పొచ్చు. కవిగా, విమర్శకుడిగా విశేష కృషి చేసిన ఆయన నవల కూడా రచించాడు. ఈ నవలకు ఆయన 'కామోత్సవ్' అని పేరు పెట్టి 'ఆంధ్రజ్యోతి' వార పత్రికలో ధారావాహికగా ప్రచురించాడు. ఈ నవల ఆంధ్రజ్యోతిలో (28.8.87 నుంచి 11.12.1987) వెలువడుతున్న రోజుల్లోనే పెద్ద దుమారం చెలరేగింది. ఈ నవలలో అశ్లీల సన్నివేశాలున్నాయని, ప్రచురించకూడదని కొందరు పాఠకులు న్యాయ స్థానాలకు వెళ్లారు. న్యాయస్థానాలు ఈ నవలలో అశ్లీలాలేమి లేవని, దీన్ని ప్రచురించుకోవచ్చని తీర్పు వెలువరించడంతో ఆ దుమారం సద్దుమణిగింది. అశ్లీలాలున్నాయనో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనో కారణాలతో చాలాకాలంగా కొన్ని పుస్తకాలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించటం, ఆ తర్వాత, ఆ పుస్తకాలపై నిషేధాన్ని న్యాయస్థానాలు తొలగించటం జరుగుతూనే ఉంది.
తెలుగులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన 'మాలపల్లి' నవలను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే వాసిరెడ్డి సీతాదేవి రచించిన 'మరీచిక' నవలను ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. విరసం ప్రచురించిన 'జంఝ' కవితా సంకలనాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇక పాశ్చాత్య సాహిత్యం విషయానికొస్తే డిహెచ్ లారెన్స్ రచించిన లేడీ చాటర్లీస్ లవర్ అనే నవలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. మరో గొప్ప ఉదాహరణ.. జేమ్స్ జాయిస్ రచించిన 'యూలేసెజ్' నవలను అమెరికా ప్రభుత్వం నిషేధించింది. మొన్న మొన్ననే సల్మాన్ రష్దీ రచించిన 'సటానిక్ వెర్సెస్' నవలను అనేక ముస్లిం దేశాల ప్రభుత్వాలతోబాటు భారతదేశ ప్రభుత్వం కూడా నిషేధించింది. ఇప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. చెప్పొచ్చేదేమిటంటే గొప్ప రచయితలు రచించిన పుస్తకాలను నిషేధించే సంస్కృతి సరైంది కాదని నా అభిప్రాయం. ఆయా పుస్తకాల్లోని మంచీచెడుల్ని నిర్ణయించుకునే బాధ్యతను పాఠకులకే వదిలేయాలి.
ఇక కామోత్సవ్ నవల విషయానికొస్తే.. ఈ నవల 2005 సంవత్సరంలోనే ఒకసారి వెలువడింది. అయితే అప్పుడు వెలువడింది కామోత్సవ్ నకిలీ నవల అని, ఇప్పుడు అంటే 2021లో వెలువడుతున్నదే గుంటూరు శేషేంద్రశర్మ గారు రచించిన ఒరిజినల్ నవల అని ఈ కొత్త ప్రచురణను వెలువరిస్తున్న గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్టు తరపున శేషేంద్రశర్మ గారి కుమారుడు సాత్యకి గారంటున్నారు. 2005లో వెలువడిన కామోత్సవ్ నవలకు ఇప్పుడు వెలువడుతున్న కామోత్సవ్ నవలకు చాలా వ్యత్యాసం ఉన్నమాట వాస్తమేనని ఆ రెండు ప్రచురణలను పరిశీలించిన వాళ్లకు అర్థమౌతుంది.
ఈ నవలలో ప్రధానంగా మన సమాజంలోని చాలా ఉన్నత వర్గాలకు చెందిన వారి జీవనశైలి ఎలా ఉంటుందో చిత్రించబడింది. తెలుగులో వెలువడుతున్న చాలా నవలల్లో మధ్య తరగతి లేక నిమ్న వర్గాలవారి జీవిత చిత్రణే జరగుతుంటుంది. అందుకు భిన్నంగా పెద్దపెద్ద రాజ భవనాల్లాంటి బిల్డింగుల్లో ఉంటూ, ఫైవ్స్టార్స్, సెవెన్ స్టార్స్ హోటళ్లలో విందులు చేసుకుంటూ, విదేశీ పానీయాల్లో మునిగితేలుతూ, వావివరసలు లేని సెక్స్ సంబంధాలు పెట్టుకుంటూ జీవించే కోటీశ్వరుల జీవన విధానాలను ఈ నవలలో రచయిత కొంత స్వానుభవంతో చిత్రించాడు. శేషేంద్రశర్మ గొప్ప కవి కావడం వల్ల ఈ నవలలో అనేక చోట్ల గొప్ప రసాత్మకమైన వాక్యాలు కనిపిస్తాయి.
తృష్ణ అనే స్త్రీని వర్ణిస్తూ ''శరీరమంతా ఆభరణాలతో ఆచ్ఛాదితం అయి ఉంది. బంగారు కాంతుల్లో, వజ్రాల కాంతుల్లో ఆమె మునిగిపోయినట్లుంది. పల్చటి మేలి ముసుగు కింద పాపడి మీదుగా జెర్రిపోతులాంటి ఒక రత్నాల పట్టా వెనక్కిపోతోంది. ముందు ముుఖం మీద దాన్నంటుకొని వాన చినుకుల్లాంటి ముత్యాలు చుట్టూ కదులుతున్న పతకం ఒకటి వేలాడుతోంది. భుజాలు దాటని ఆవిడ జాకెట్టు ఎన్ని మాంసపు లోయల్ని, సౌందర్య వక్రరేఖల్ని గోప్యం చెయ్యటానికి ప్రత్నిస్తోందో రసాళువైన ఒక్క కన్నుకే తెలుసు. జబ్బల మీద వెడల్పయిన రత్నాల కడియాలు, తామర మొగ్గల్లాంటి చుట్టూ, బోగన్విల్లియా గుచ్ఛాల్లాంటి మాణిక్యాల గాజుల గుంపులు, కంఠాన్ని కౌగలించుకొని బతిమాలుకుంటు న్నట్టు వేలాడుతున్న బస్రా ముత్యాలు, ఊదారంగు హారం మూడు పేరులు.. ఇన్ని ఆభరణాల్ని ఈరోజుల్లో మెట్రోపాలిటన్ నగరాల్లో ఎవ్వరూ ధరించరు'' అంటాడు శేషేంద్రశర్మ. ఇట్లాంటి వర్ణనలు ఈ నవలలో కోకొల్లలు.
నవలలో పెద్ద కథంటూ ఏమీ లేదు. ఈ నవలలోని కథా నాయకుడు జ్ఞాన్ను ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు వెంటాడుతుంటారు. వాళ్లనుంచి తప్పించుకొని జ్ఞాన్, అతని భార్య కీర్తితో కలిసి ముంబై పారిపోతాడు. ముంబైలో తాజ్మహల్ లాంటి పెద్దపెద్ద స్టార్ హోటళ్లలో ఉంటూ వహీదా రెహమాన్ లాంటి సినిమా స్టార్లు ఇచ్చే పార్టీలకు వెళ్తుంటారు. నవల చివర్లో జ్ఞాన్ భార్య కీర్తి చెల్లెలు తృష్ణ ఆమె బావగారైన జ్ఞాన్ ప్రేమలో పడి అతనితో అమెరికాకు వెళ్ళిపోతుంది.
కామోత్సవ్ రాయటంలో మీ ప్రథమ ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శేషేంద్రశర్మ.. ''అన్ని నీతులూ, అన్ని చట్టాలూ సాధారణ ప్రజలకే గానీ ఉన్నత వర్గాలకు వర్తించవు. ఉన్నత వర్గాల్లో ఉన్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక, నైతిక పతనం మీద ఈ వర్గానికి ఏ బాధ్యతా లేకపోవడం, ఆ వర్గాలే దేశానికి పాలక వర్గాలుగా ఉండడం - దీన్ని చిత్రించడం ఈ నవలలో ప్రధాన ఉద్దేశం. తత్సంబంధంగా వచ్చిన అనేక విషయాలు అందులో చర్చించబడ్డాయి. మన రుషీశ్వరులు ఘోషిస్తున్నట్టుగా ప్రమాదకర విషయాలు అందులో ఏమిలేవు. అందుకే రుషీశ్వరులు పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది'' అన్నాడు. ఇలా శేషేంద్రశర్మ గారు ఈ నవల రాయడంలో తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే చెప్పారు. ఈ నవల చదివాక ఆయన ఉద్దేశం చాలావరకు నెరవేరిందనే చెప్పాలి.
- అంపశయ్య నవీన్