ప్రభుత్వ ఉద్యోగులతోనే నిర్వహించాలి
ఇది చారిత్రాత్మకం : మంత్రి వేణు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
కుల గణనలో పారదర్శకత అవసరమని, ప్రభుత్వ ఉద్యోగులతోనే కులగణనను నిర్వహించాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని పలువరు వక్తలు అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు, మేధావులతో ప్రాంతీయ కులగణన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతో సమగ్ర కుల గణనకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకుల ఆలోచనలను, సూచనలు, సలహాలను పరిగణనలోనికి తీసుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బిసిలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాటిని పొందలేక పోతున్నారన్నారు. దీంతో సమగ్ర కులగణన సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఏడు నెలలుగా కసరత్తు చేసి అందరికి సమన్యాయం చేసే దిశలో సర్వే ప్రక్రియకు రూపకల్పన చేశామన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 723 కులాలు ఉన్నాయన్నారు. సమ న్యాయం కోసం మాత్రమే ఈ సర్వేను చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో కులగణనపై ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తొలి సమావేశంలో సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం హర్షనీయమన్నారు.
కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ కులగణనపై తొలి ప్రాంతీయ సదస్సులో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు నాయకులు ఇచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఇంకా ఏమైన సూచనలు సలహాలు ఉంటే కలెక్టరేట్‌లో అందించా లన్నారు. సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కులగణన స్వాగతీయమన్నారు. కులాల దామాషా ప్రకారం వారికి రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా అభివద్ధి చేసేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. బిసిలకు భవిష్యత్తులో రాజకీయంగా, సామాజికంగా దోహదపడేందుకు కుల గణన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ పదవులు, విద్యా, ఉద్యోగ, సామాజిక న్యాయం చేసే అవకాశం కుల గణన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందన్నారు. కుల గణన ద్వారా సమగ్ర సమాచారం సేకరించడం కోసం వేదిక కావాలని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ సమగ్ర కులగణన సర్వే పట్ల ప్రజలు సానుకూలత ధక్పథంతో ఉన్నారని, మరింతగా పేద, నిరుపేద వర్గాలకు అండగా నిలిచేందుకు ఈ సర్వే ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో బుద్దె జార్జ్ అంథోని, డాక్టర్ అనసూరి పద్మలత, దేవారి అంజలి, జువ్వల రాంబాబు, పాక సత్యనారాయణ, దొడపాటి సుధాకర్, ఇళ్ల శివ ప్రసాద్, బండి విజయ భాస్కరరావు, మోషే సోము, కే. సంజీవరావు, దేవర సత్యనారాయణ, అశోక్ కుమార్ జైన్, దారం ఏసురత్నం, దేవరకొండ వెంకటేశ్వర్లు,కోరుకొండ చిరంజీవి, సూర్య చంద్ర యాదవ్, పడగల ప్రసాద్, పిల్లి డేవిడ్ కుమార్, సుందరపల్లి గోపాలకృష్ణ, జెసి ఎన్.తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఆర్‌డిఒలు తదితరులు పాల్గొన్నారు.