May 05,2023 21:34
  • కేరళపై సంఫ్‌ు పరివార్‌ విద్వేషపూరిత దాడికి డివైఎఫ్‌ఐ కౌంటర్‌
  • సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన యువజన సంఘం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళపై సంఫ్‌ు పరివార్‌ విద్వేషపూరిత దాడికి కౌంటర్‌గా డివైఎఫ్‌ఐ సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. డివైఎఫ్‌ఐ 'రియల్‌ కేరళ స్టోరీ (నిజమైన కేరళ కథ)' పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించింది. తమకు రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ కథనాలను ఎవరైనా పంపవచ్చని ప్రజలను కోరింది. కేరళకు వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్‌ ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తాము పెద్దఎత్తున సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రారంభించనున్నామని డివైఎఫ్‌ఐ శుక్రవారం తెలిపింది. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వికె సనోజ్‌ మాట్లాడుతూ.. కేరళ స్టోరీ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభిస్తున్నామని, రాష్ట్రంలోని వాస్తవ కథనాలను ప్రజలెవరైనా తమకు పంపవచ్చని తెలిపారు. 'మేము ఈ వీడియోలను తనిఖీ చేసి వాటిని అప్‌లోడ్‌ చేస్తాము. ఈ వీడియోలు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కూడా అప్‌లోడ్‌ చేయబడతాయి' అని సనోజ్‌ చెప్పారు.
డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి ఎఎ రహీమ్‌ మాట్లాడుతూ.. 'కేరళకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారాన్ని సమర్థించాలనే ఆలోచనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంది. లవ్‌ జిహాద్‌, నార్కోటిక్స్‌ జిహాద్‌ ప్రచారాల నుండి వారు ఇలాంటి విద్వేష ప్రచారాలకు పాల్పడుతున్నారు. కేరళ ప్రతిష్టను దిగజార్చడానికి వారు సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ఇలాంటి అనేక తప్పుడు ప్రచారాలను ప్రసారం చేస్తున్నారు' అని విమర్శించారు. 'మత సామరస్యం నుండి పర్యాటక ప్రాంతాల వరకు, విద్య, పేదలకు ఇళ్లు అందించే లైఫ్‌ మిషన్‌ వంటి సామాజిక సంక్షేమ పథకాల వరకు ఏవైనా అంశాలు కేరళ అభివృద్ధిని ప్రతిబంబించే వాస్తవ వీడియో ఉండాలి. మేము ప్రజలకు వాట్సాప్‌ నెంబరును షేర్‌ చేస్తాము. వారు వీడియోలను ఆ నెంబరుకు పంపవచ్చు' అని తెలిపారు.