మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే వాటిల్లో ముఖ్యమైనవి కిడ్నీలు. ఇవి రక్తంలోంచి వ్యర్థాలను, విషతుల్యాలను వడపోస్తాయి. మూత్రం రూపంలో వాటిని బయటకు వెళ్లగొడతాయి. అందుకే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
శ్రీ మనం తినే పదార్థాలు, తాగే పానీయాలన్నీ జీర్ణమయ్యాక రక్తం ద్వారా కిడ్నీలకు చేరుకుంటాయి. శరీరానికి హాని కలిగించే కొవ్వు, ఉప్పు, చక్కెరలనూ ఇవి శుద్ధి చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఇవి కిడ్నీలకూ చేటు చేస్తాయి. కాబట్టి కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో కూడిన మంచి ఆహారం ఎక్కువగా తినాలి.
- ముఖ్యమైన పోషకాలు కిడ్నీలకు చేరుకునేలా, మూత్రం రూపంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోయేలా చేయటానికి నీరు తోడ్పడుతుంది. తగినంత నీరు తాగకపోతే కిడ్నీల్లో రక్తాన్ని శుద్ధిచేసే నెఫ్రాన్లు పనిచేయటం మానేస్తాయి. ఒంట్లో నీటిశాతం తరచూ తగ్గుతుంటే కిడ్నీలు దెబ్బతినొచ్చు. కాబట్టి దాహం వేసినంతవరకూ ఆగకుండా మధ్యమధ్యలో నీళ్లు తాగటం మంచిది. ఒకవేళ వేడి వాతావరణంలో ఉంటే ఇంకాస్త ఎక్కువగానూ తాగాలి.
- మంచి ఆహారం మాదిరిగానే వ్యాయామమూ గుండె జబ్బు, మధుమేహం నివారణకు తోడ్పడుతుంది. పరోక్షంగా కిడ్నీ జబ్బు ముప్పూ తగ్గుతుంది. అలాగని వెంటనే జిమ్‌లకు వెళ్లి, భారీ కసరత్తులు చేస్తారేమో. ఇది తగదు. శక్తికి మించిన.. ముఖ్యంగా ఉన్నట్టుండి అతిగా వ్యాయామం చేయటమూ కిడ్నీలను దెబ్బతీయొచ్చు. కాబట్టి నెమ్మదిగా వ్యాయామాలు ఆరంభించాలి. రోజుకు కనీసం అరగంట సేపైనా నడవాలి.
- కిడ్నీ జబ్బు ముప్పును తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇంట్లో ఎవరైనా గుండెజబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వైఫల్యం గలవారుంటే ఇది మరింత ప్రధానం. కిడ్నీ పనితీరును తెలిపే పరీక్షలతో జబ్బులను ముందుగానే పట్టుకోవచ్చు. పరిస్థితి చేజారకుండా చూసుకోవచ్చు.