ఢిల్లీ సరిహద్దుల్లో నెలరోజులుగా సాగుతున్న రైతాంగ ఉద్యమంలో సృజనాత్మకత వెల్లివిరుస్తోంది. యువత కొత్త కొత్త పద్ధతుల్లో ఉద్యమ ప్రచారానికి పూనుకోవడమే కాదు నిరసనల్లో కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఢిల్లీ సింఘు సరిహద్దులో యువకుల బృందం ఇప్పుడు వారి సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి కొత్త మార్గంతో ముందుకు వచ్చింది. పతంగులపై నినాదాలు రాసి వాటిని ఎగరేస్తున్నారు యువతీ యువకులు. 'పతంగులు పూర్తిగా పైకి వెళ్ళాక దారాన్ని కత్తిరిస్తాము. ఇది మా సందేశాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్లడానికి, మా పోరాటం గురించి వారికి తెలియజేయడానికి సహాయపడుతుంది. బహుశా ఈ గాలిపటాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా నివాసాలకు కూడా చేరుతాయి. రైతులకు ఏమి కావాలో అప్పుడైనా వారు తెలుసుకుంటారు' అని 25 ఏళ్ళ సుర్దీప్ సింగ్ చెబుతున్నాడు.
ఢిల్లీ సింఘు సరిహద్దులో 'మేము టెర్రరిస్టులం కాదు రైతులం' అనే ప్లకార్డులు పట్టుకొని, యువత గుంపులుగా తిరుగుతున్నారు. ఈ ఉద్యమంలో భాగస్వాములైన వారు జాతీయోద్యమంలో భగత్‌సింగ్ ఇచ్చిన ''ఇంక్విలాబ్ జిందాబాద్'' నినాదాన్ని చెబుతూ రైతులను ఉత్సాహపరుస్తున్నారు. పంజాబ్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు మూడు షిప్టుల్లో సేవలు అందిస్తున్నారు. చలిలో అవయవాలు బిగుసుకుపోయిన వృద్ధులకు శ్రద్ధతో మర్దన చేసి, మళ్లీ కార్యోన్ముఖులను చేస్తున్నారు. కొన్ని సంస్థలు మసాజ్ యంత్రాలు ఏర్పాటుచేసి దాతృత్వాన్ని చాటుకున్నాయి. ఎప్పటికప్పుడు షుగర్, బీపీ పరీక్షలు చేస్తూ అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా కొందరు తమ ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లో వాడే జనరేటర్లను తీసుకొచ్చారు. కొందరు దుస్తులు, మేజోళ్లు, చెప్పులు అందజేస్తున్నారు. ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళాప్రదర్శనలు నిర్వహిస్తూ ఉద్యమకారులను ఉత్సాహపరుస్తున్నారు.