ప్రజాశక్తి -గాజువాక, ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేపట్టిన దీక్ష ఈ నెల 8వ తేదీకి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టే మహాదీక్షను జయప్రదం చేయాలని అఖిలపక్ష యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్లాంట్ బిసి గేటు వద్ద కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, మహా దీక్షలో ఉక్కు కార్మికులు, కుటుంబ సభ్యులతో సహా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు దారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఉక్కు కర్మాగారం ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాశ్వత ఉపాధి కోసం ఉక్కు నిర్వాసితులు పోరాటాలలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, వరసాల శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, యు.రామస్వామి, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
998వ రోజుకు దీక్షలు
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు ఈ నెల 8వ తేదీకి 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో కార్మికులు, అధికారులు, నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పోరాట కమిటీ నాయకులు పిలపునిచ్చారు. కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు సోమవారంర నాటికి 998వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ఎల్‌ఎం, ఎస్‌బిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ, సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గాజువాక వచ్చిన వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసి స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రధానపాత్ర పోషించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నరేంద్ర, ఎం.త్రినాథ్, కె.భాస్కర్, పి.సీతారామరాజు, ఎల్‌వి.రమణ, ఎ.రాము, డి.సత్యనారాయణ, బి.నాగరాజు, మంగ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.