ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కొవ్వూరు నియోజక వర్గం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంతా మహేంద్ర మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో వైసిపి గ్రూపుల పోరులో జరిగిన వివాదంలో గ్రామానికి చెందిన దళిత యువకుడు ఆత్మహత్య వరకూ దారితీసిన వైనం దిగ్భాంతికి గురిచేసిందని అన్నారు. జరిగిన ఘటనకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు వైసిపి, పోలీసులు కారణమైతే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం సిగ్గుచేటన్నారు. గ్రామ వైసిపి గ్రూపుల పోరు నేపథ్యంలో దళిత యువకుడు బొంతు మహేంద్రను కొవ్వూరు పోలీస్ స్టేషన్లో నిర్భందించారని తెలిపారు. దీంతో ఆ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత హోంమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. దళిత యువకుడుని రోజంతా పోలీస్ స్టేషన్‌లో నిర్భందించిన నేపథ్యంలోనే ఆ యువకుడు భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, ఈ వర్గపోరులో దళిత యువకుడు బలికావటం బాధాకరమని అన్నారు. మొత్తం జరిగిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుచేయాలని డిమాండ్ చేశారు. చిన్న ప్లెక్సీ వివాదాన్ని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దళిత యువకుడి మృతికి కారణం అయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు బి.పవన్, బి.రాజులోవ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.