మండిన ధరలు..
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
దీపావళి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కాకరపూల వెలుగులు, టపాసులు ఢాం.. ఢాం శబ్దాలు... అవి లేకుండా దీపావళి పండుగ జరుగదు. దీపావళికి కొనుగోలు చేసే టపాసులు ధరలు ఈ ఏడాది మండిపోయాయి. గతేడాది కంటే 20 నుంచి 25 శాతం వరకూ ధరలు పెరగడంతో సామాన్యులు టపాసులను కొనేందుకు ఆసక్తి చూపలేదు. మరికొంత మంది తక్కువ మొత్తంలో కొనుగోలుతో సరిపెట్టుకున్నారు. చిన్నారుల కోసం 6 రకాల టపాసులు కొనాలన్నా కనీసం రూ. 2 వేల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చింది. మధ్య రకం స్పార్కిల్స్(కాకరపూలు) గతేడాది రూ.60 నుంచి రూ.70 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90 ఉన్నాయి. చిచ్చుబుడ్డి బాక్స్ గతేడాది రూ.150 ఉండగా రూ. 200కు పెరిగింది. పెన్సిళ్లు గతేడాది రూ.120 ఉండగా రూ.170కు పెరిగాయి. తాళ్లు గతేడాది రూ.120 ఉండగా ఈ ఏడాది రూ.150కు పెరిగాయి. 1000 వాలా టపాసులు గతేడాది రూ.350 విక్రయించగా ఈ ఏడాది రూ.450కు విక్రయించారు. రూ.500 వెచ్చిస్తే కనీసం 3 రకాల టపాసులు కూడా రాలేదు. అధిక ధరల వల్ల చాలా దుకాణాల్లో ఫ్యామిలీ ప్యాక్‌లు తెప్పించడమే మానేశారు. చిన్నారుల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది తక్కువ మొత్తంలో టపాసులు కొనుగోలు చేసి సరిపెట్టుకున్నారు.
ఎండుతున్న పంటలు...
ఆరుగాలం కష్టపడే రైతు అతివృష్టి, అనావృష్టితో ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి పెట్టుబడులు మట్టిపాలై అన్నదాతలు అప్పులపాలయ్యారు. గ్రామాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలసలు వెళుతున్నారు. కరువుతో పశువులకు మేత లేక పాడిపోషకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు మేత లేక అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు వేసిన పంటలు వర్షాలు లేక 90 శాతం ఎండిపోయాయి.
ప్రజా రక్షణ భేరి జయప్రదానికి..
ఈ నెల 15న విజయవాడలో అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి విజయవాడ తరలివెళ్లారు. కర్నూలులో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. నంద్యాలలో బైక్ ర్యాలీ చేపట్టారు.
అవీ..ఇవీ..అన్నీ...
మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అఖిలభారత సహకార వారోత్సవాలు జరిగాయి. వైసిపి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'ఏపికి జగనే ఎందుకు కావాలి' కార్యక్రమాలు చేపట్టారు.