గుంటూరు ఎండలకు ఉదయం నుంచి విసిగి వేసారిన ప్రజలను సాయంకాలపు చల్లగాలులు స్వాంతన పరుస్తున్నాయి. కానీ ఉదయం ఆఫీసులో జరిగిన విషయం వల్ల రఘు మనసు ఆ చల్లదనాన్ని ఆస్వాదించ లేకపోతోంది. బాగా విసుగ్గానూ కొంత అయోమయంగానూ అనిపిస్తోంది. అన్యమనస్కంగానే ఇంటికొచ్చాడు.
హాల్లో నుండి వదిన తన ఎనిమిదేళ్ళ కొడుకును దండించడం వినిపిస్తోంది. 'నువ్వు చూస్తే మాత్రం, నువ్వెందుకు టీచర్‌తో గోపి బుక్‌లో వేణు బొమ్మలు వేశాడని చెప్పావు? అందువల్ల వేణును టీచర్ కొట్టడం, దాంతో వేణు ''నీతో ఫ్రెండ్‌షిప్ కట్'' అని చెప్పడం అయ్యింది కదా!' అంటోంది వదిన.
'మరి చూసింది చెప్పాను, తప్పు కాదుగా?' అంటూ వాడు ఏడుస్తున్నాడు.
'కానీ, నీతో పాటు మిగతా పిల్లలూ చూశారు కదా? వాళ్ళు చెప్పలేదు కాబట్టి నీ మీద వాడికి కోపం వచ్చింది!' అని వదిన అంటే.. 'పో.. నీతో మాట్లాడను. నిజం చెప్పమనేది నువ్వే. మళ్ళీ ఎందుకు చెప్పావనేదీ నువ్వే!' అని వాడు వదినను తోసేస్తున్నాడు. వదిన వాణ్ణి సముదాయిస్తూ లోపలికి తీసుకెళ్ళింది.
రఘు మనసు కూడా ఆ పిల్లవాడిలాగే ఉంది. కాకపోతే వాడు పిల్లవాడు కాబట్టి ఏడుస్తున్నాడు. తాను ఏడవలేక పోతున్నాడు. రఘుకు చిన్నప్పుడు వాళ్ళమ్మ అబద్ధాలు చెప్పవద్దని చెప్పిన సంఘటన గుర్తొచ్చింది. ఆ జరిగిన విషయం అమ్మ రెండు, మూడుసార్లు తాను పెరుగుతూ వున్నప్పుడు గుర్తు చేస్తూ ఉండేది. అందువల్ల తనకు బాగా గుర్తుండిపోయింది. అంతేకాకుండా దొంగతనం చెయ్యకుండా వుండటం, అబద్ధాలు చెప్పకుండా వుండటం, చూసిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం, తప్పు చేయకుండా వుండటం బాగా అలవాటు చేసుకున్నాడు కూడా. తనకు మూడు సంవత్సరాలప్పుడు పక్కింటి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద మామిడిపండును తీసుకొని పరిగెడ్తూ ఇంటికొచ్చానట! అమ్మ నన్ను కొట్టకుండా ఆ పండు తీసి, బీరువా పైన పెట్టిందట. 'అలా వాళ్లకు చెప్పకుండా తీసుకురాకూడదు.. తప్పు అని చెప్పిందట!' అది చెడిపోయే వరకూ బీరువా మీదే ఉందట. రోజూ అది చూపిస్తూ 'ఇంకెప్పుడూ అలా తీసుకురావద్ద' ని చెప్పేదట! ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయనుకుంటాను. జరిగిన విషయాలు దాచి పెట్టడం, తప్పించుకోవడం తను చెయ్యలేడు. ఇప్పుడు ఆఫీస్‌లో తను మాట్లాడకుండా వుంటే ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేది కదా! తాను తప్పు చెయ్యలేదు. ఏమైనా జరగనీ. అంతగా అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు అంతే కదా! అన్యాయాన్ని చూస్తూ మిగతావారిలా ఉండలేడు తను. ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న రఘును బయటి నుంచి వస్తున్న వాళ్ళ నాన్న చూసి 'రఘు, ఏమిటలా ఉన్నావు? ఇంకా ఫ్రెష్ అవలేదే?' అని అడిగాడు.
'లేదు నాన్నా, ఈ రోజు ఆఫీస్‌లో ఒక విషయం జరిగింది. అదే ఆలోచిస్తున్నాను. నేను చేసింది మంచి కదా!' అని అన్నాడు రఘు. 'ఏం జరిగింది?' అన్నాడు వాళ్ళ నాన్న.
రఘు ఇలా చెప్పుకొచ్చాడు.. 'ఉదయం మా ఆఫీస్‌కు రీజనల్ ఆఫీసర్ గారు వచ్చారు. ఇన్‌స్పెక్షన్ జరుగుతోంది. ఫైల్స్ చూస్తున్నారు. అప్పుడు వెంకటేశ్వర్లు అనే క్లర్క్ ఒక ఫైల్ టేబుల్ మీద పెట్టి ఇంకో రూమ్‌లో ఉన్న బీరువాలో ఇంకో ఫైల్ తీసుకుంటున్నాడు. ఈ లోపల నా పక్క సీట్‌లో ఉండే యాదగిరి అనే క్లర్క్ వెంకటేశ్వర్లు టేబుల్ మీద పెట్టిన ఫైల్‌ను బీరువా వెనుక పడేశాడు. అది నాతో పాటు ఇంకా ముగ్గురు చూశారు కూడా. అయినా ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి వెంకటేశ్వర్లు వచ్చి ఫైల్ వెతుక్కుంటున్నాడు. అటెండర్‌లు కూడా హెల్ప్ చేస్తున్నారు. అయినా ఫైల్ దొరకలేదు. లోపల్నుంచి ఆ ఫైల్ కావాలని రీజనల్ ఆఫీసర్ గారు అరుస్తున్నారు. ఇక్కడ ఫైల్ వెతుకుతున్న హడావిడికి కొద్దిసేపటికి రీజనల్ ఆఫీసర్ కూడా బైటికొచ్చారు. అంతా విని, ''అంత నిర్లక్ష్యంగా ఎలా వుంటారు? డైరెక్టరేట్‌కు ఏమని చెప్తారు? ఒరిజినల్స్ ఎలా వస్తాయి? సస్పెన్షన్ అవుతారు జాగ్రత్తా!'' అనేసి లోపలి కెళ్ళారు. ఇక వెంకటేశ్వర్లు దిగాలు పడిపోయాడు. అయినా ఎవరూ మాట్లాడటం లేదు. ఆఫీసర్‌కు యాదగిరికి అవినీతి వ్యవహారాలలో బాగా స్నేహం. అందుకే చెప్పడానికి అందరూ భయపడ్తున్నారు. వెంకటేశ్వర్లంటే యాదగిరికి పడదు. వెంకటేశ్వర్లు బాగా పనిచేస్తాడు, అవినీతికి లొంగడు. అందుకని ఈ రోజు రీజనల్ ఆఫీసర్ ముందు తన కసి ఇలా ఫైల్ దాచిపెట్టి, తీర్చుకున్నాడు యాదగిరి.
సస్పెన్షన్ అన్న మాట విని రఘు, ఇంక ఆలస్యం చెయ్యకుండా యాదగిరి చేసిన పనిని ఆఫీసర్‌కు చెప్పాడు. దాంతో వెంకటేశ్వర్లు ఫైల్ తీసుకొని, ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆఫీసర్‌కు యాదగిరిని ముందుకు తీసుకురావడమే కష్టంగా ఉండింది. రఘును గుర్రుగా చూశాడు కూడా!' అని ముగించాడు రఘు.
'రేపట్నుంచీ ఆఫీస్‌లో కొంచెం ఇబ్బంది పెడతారనుకుంటాను. ట్రాన్స్‌ఫర్ కూడా జరగొచ్చేమో అనిపిస్తోంది. మిగతా వాళ్ళు సైలెంట్‌గా వున్నారని, నేను సైలెంట్‌గా వుండలేకపోయాను. నేను చేసింది కరెక్టే కదా? ఒక ఫ్యామిలీ సిక్స్ మంత్స్ సఫర్ అయ్యుండేది నేను మాట్లాడకుంటే. అందుకని నేను ధైర్యం చేశాను' అన్నాడు రఘు మళ్ళీ.
'రఘు, నువ్వేం దిగులు పడకు. నువ్వు తప్పు చెయ్యలేదు. ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు ఇంటర్ పరీక్షలప్పుడు ఎంత ధైర్యంగా రాశావో గుర్తు తెచ్చుకో!' అంటూ, వాళ్ళ నాన్న రఘు భుజం తట్టి, లోపలికెళ్ళారు.
నిజమే! ఇంటర్లోనే ఎంతో ధైర్యంగా లెక్చరర్ మాట వినకుండా, నిజాయితీగా పరీక్షలు రాశాను కదా అనుకొని, ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు రఘు.
సీనియర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందరూ సీరియస్‌గా కాపీలు రాస్తున్నారు. లెక్చరర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. రఘు ఒకసారి తలెత్తి చూసి, కొంచెం విసుక్కొని మళ్ళీ తలొంచుకొని రాసుకుంటూ ఉన్నప్పుడు లెక్చరర్ వచ్చి 'అదిగో అక్కడ స్లిప్ ఉంది. తీసుకుని చూసి రాయవచ్చు కదా?' అన్నాడు. రఘు తలెత్తి 'వద్దు సర్' అన్నాడు. లెక్చరర్ కోపంగా వెళ్లిపోయారు. రిజల్ట్స్ వచ్చిన తరువాత కాలేజీకెళ్ళి స్టాఫ్‌రూమ్‌లో లెక్చరర్స్‌తో మాట్లాడేటప్పుడు, రఘును కాపీలు రాయమని చెప్పిన లెక్చరర్ 'నీకు ఫస్ట్‌క్లాస్ రావాల్సింది!' అన్నాడు. రఘు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు అమ్మనాన్నే నాకు ధైర్యం చెప్పారు. 'నువ్వు తప్పు చెయ్యలేదు. నీకొచ్చే మార్కులు చాలు!' అని.
అదంతా గుర్తొచ్చింది రఘుకు. కాబట్టి తానిప్పుడు మంచిపనే చేశాడు. అలా చేయకుంటే మనసులో ఎప్పుడూ తాను చెప్పి ఉంటే బాగుండేదే అనే బాధ ఉండేది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. తన మనసు చెప్పినట్లు తాను చేశాడు. మనసు మాట విన్నాడు. కాబట్టి మనసులో ఘర్షణ లేదు. టీవీలో నుంచి పాట వినిపిస్తోంది. ''మనిషి బతుకు నరకమౌను మనసు తనది కానిదే!'' అని. అది వింటూ.. 'అవును తన మనసు తనది. తన మనసు మాట వినటం తనకు ఇష్టం. తన మనసు నిజాయితీని కోరింది. తను నిజాయితీగానే ఉంటాడు!' అని అనుకున్నాడు. రఘు మనసు ఇప్పుడు తేలికైంది.
కె. లక్ష్మీ శైలజ
[email protected]