ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు
ప్రజాశక్తి - నంద్యాల
నంద్యాల పట్టణంలోని పింగళి సూరన స్మారక శాఖా గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పింగళి సూరన సారస్వత సంఘ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు హాజరై పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయములోని విశేషాలను, అందులోని సాహిత్య మాధుర్యాన్ని విద్యార్థులకు వివరించారు. గణిత అధ్యాపకుడు మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయులు కె.నాగశేషులు, విజయ భాస్కర్ మాట్లాడారు. ఇంచార్జ్ గ్రంథాలయాధికారి అర్ఇ.శ్రీధర్ అతిథులను, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ పోటీ పరీక్షల విజేతలైన విద్యార్థులకు డాక్టర్ సహాదేవుడు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, హుస్సేనప్ప తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్బరాయుడు, మెయిన్ పాఠశాల హెచ్ఎం సుదర్శన్‌లు తెలిపారు. గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి శౌరెడ్డి మాట్లాడారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. శ్రీనివాసులు, విజరు కుమార్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పట్టణ సిఐ రమేష్ బాబు అన్నారు. 56వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సిఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సిఐ రమేష్ బాబు, సమాజ సేవకులు రామ సుబ్బారెడ్డిని గ్రంథాలయ అధికారి అరుణకుమారి సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల హెచ్ఎం ఫిర్దోస్ అంజుమ్, హెచ్ఎం వీర రాఘవయ్య, గంగిశెట్టి వెంకట సుబ్బయ్య, వెంకట రాముడు లు పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి, మధు, వెంకటరెడ్డి, స్వరూప లను గ్రంథాలయ అధికారి బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వివిధ పోటీ పరీక్షల విజేతలకు బహుమతులను అందజేశారు. రిటైర్డ్ హెచ్ఎం శ్రీరాములు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.