ప్రజాశక్తి-చీమకుర్తి : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌నగర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్టా నాగయ్య, సిఐటియు నాయకుడు పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ ,హెల్త్ అలవెన్సులు ఇవ్వాన్నారు. కోవిడ్ కార్మికులను ఆప్కాన్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులపై అధికారుల వేధంపులు ఆపాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి పి.కోటేశ్వరరావు, పి. పద్మ, కోటేశ్వరి, ఆండ్రి, రమణ, బ్రహ్మయ్య, గోవిందు, వెంకటేశ్వర్లు,పేతురు, శ్రీను పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్ : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి.రవి ,చంటయ్య, ఎం.మురళి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికులను నియమించాలన్నారు. పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలనిడిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 8న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పి.పాపయ్య, బాబు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు