ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోనే రైతులు తమ పత్తిపంటను అమ్ముకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి రాంబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు మార్కెట్ కమిటీ చైర్మన్ పి.బాబురావు అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, నాణ్యమైన పంటను తెచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని సిసిఐ బయ్యర్‌ను మంత్రి ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు మాట్లాడుతూ పంట నాణ్యతను బట్టి ధర లభిస్తుందన్నారు. కనీస మద్దతు ధరగా క్వింటాళ్‌కు రూ.7,020గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో ఎడిఎ శ్రీధర్‌రెడ్డి, యార్డు కార్యదర్శి ఇస్మాయిల్, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్లం విజయభాస్కర్‌రెడ్డి, యార్డు మాజీ చైర్మన్ ఆర్.పురుషోత్తం, వైసిపి నాయకులు సిహెచ్.సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు సహార మౌలాలీ పాల్గొన్నారు.